విజయవాడ, అక్టోబరు 1,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన కసరత్తు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్పప్పటికీ- పార్టీ శ్రేణులను ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తోన్నారు. శాసన సభ్యుల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తోన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దీనికి ఆధారంగా చేసుకుంటోన్నారు. రాజీధోరణి ఉండదు.. తాజాగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వైఎస్ జగన్.. తన లక్ష్యం ఏమిటనేది మరోసారి స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ జెండా ఎగిరి తీరాల్సి ఉంటుందనీ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీధోరణిని తాను ప్రదర్శించబోనని తేల్చి చెప్పారు. ఇదివరకటి కంటే కాస్త భిన్నంగా తాజాగా వర్క్‌షాప్ జరిగింది. తాను చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు. ఏ ఒక్క నియోజకవర్గాన్ని కూడా వదులుకోవటానికి తాను సంసిద్ధంగా లేననీ పేర్కొన్నారు.27 మందిపై మొత్తంగా 27 మంది ఎమ్మెల్యేల పనితీరుపై వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ 27 మందిలో మంత్రులు సైతం ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ అగ్రస్థాయి నాయకులు చెబుతోన్నారు. తరువాతి వర్క్‌షాప్ ఏర్పాటయ్యే నాటికి వారంతా తమ పని తీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందంటూ డెడ్‌లైన్ కూడా విధించారు. ఈ నెల రోజుల వ్యవధిలో వారి పనితీరుకు సంబంధించిన సమాచారం మొత్తాన్నీ తెప్పించుకుంటానని వివరించారు. పనితీరు మెరుగుపడితేనే.. ఈ 27 మందిలో మంత్రులు ఆర్‌కే రోజా, తానేటి వనిత, కారుమూరు నాగేశ్వరరావు, బుగ్గన రాజేంద్రనాథ్, స్పీకర్ తమ్మినేని సీతారం, మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ఆళ్ల నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్.. వంటి సీనియర్లు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వైఎస్ జగన్ చేయించే తదుపరి సర్వేల్లో వారి పనితీరు మెరుగు పడినట్టు తేలితేనే టికెట్లు లభించే అవకాశం ఉంది. లేదంటే- పార్టీ కార్యక్రమాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. క్లారిటీ ఇచ్చిన సాయిరెడ్డి.. కాగా.. ఇప్పుడిదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి కూడా స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పార్టీ అగ్ర నాయకత్వం అనుసరించదలిచిన ప్రాతిపదికలేమిటనేది తేల్చి చెప్పారాయన. అభ్యర్థుల పనితీరు ఆధారంగా మాత్రమే అభ్యర్థల ఎంపిక ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ అంచనాలను అందుకుంటేనే ఎమ్మెల్యే టికెట్ సాధ్యపడుతుందని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి. వైఎస్ జగన్ అసంతృప్తితో ఉన్న 27 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ఇది వర్తించదని ఆయన పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రతి ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమ నియోజకవర్గాల పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే టికెట్ దక్కుతుందని అన్నారు. పని చేయడమా? లేదా టికెట్ కోల్పోవడమా? అనే రెండే రెండు ప్రాథమిక సూత్రాల మీద ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారాయన.