YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయాలు

రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయాలు

కర్ణాటకలో రాజకీయ రసవత్తర పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నాటకీయ పరిణామాల మధ్యన యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం, రాజీనామా చేసి తప్పుకోవడం జరిగాయి. ఇక సీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 116 సీట్లు ఉన్నాయి. మినిమం మెజారిటీ కన్నా మూడు సీట్లు అదనంగా ఉంది వీరి బలం. అయితే కర్ణాటకలో ఇంకా ఎన్నికలు జరగాల్సిన సీట్లు ఉన్నాయి. నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి మరణించడంతో జయనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నిక వాయిదా పడింది. అలాగే ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ సీటు ఎన్నిక కూడా వాయిదా పడింది. ఈ రెండు సీట్లకూ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సీటూ కీలకమే. అందులోనూ నాటకీయ రాజకీయ పరిణామాల అనంతరం ఈ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ రెండు సీట్లలో విజయం కోసం పరస్పరం సహకరించుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు నిర్ణయించాయి. ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా పోటీ చేసి అమీతుమీ తలపడ్డ ఈ పార్టీలు ఇప్పుడు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయనగర్, ఆర్ఆర్ నగర్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. వీటిల్లో ఒక దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థిని జేడీఎస్, మరో దాంట్లో జేడీఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ సమర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఉమ్మడిగా పోటీ చేసి ఈ పార్టీలు తమ సత్తా ఎంతో చూపించనున్నాయి. ఇక ఈ సీట్ల ఎన్నికలకు బీజేపీ కూడా కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార హెగ్డేలు ఈ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్నారు.

Related Posts