విజయవాడ
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం 9వ రోజు కనకదుర్గమ్మ మహిషాసుర మర్దని దేవి అంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి. దేవస్థానం తరపున సారెను చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పట్టు వస్త్ర సమర్పణ గావించారు. ముందుగా ఆలయ ఈవో డి.భ్రమరాంబ, జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, మంగళవాయిద్యముల నడుమ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభతో స్వాగతం పలికారు. పట్టు వస్త్ర సమర్పణ, అమ్మవార్ల దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటము, ప్రసాదములు అందజేశారు.
అనంతరం దేవస్థాన మీడియా పాయింట్ వద్ద టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ టిటిడి దేవస్థానం తరఫున ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సాలికట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
అదే రీతిలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మకు కూడా అదే మాదిరిగా ఏర్పాట్లు చేసారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన శీఘ్రదర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేశారని అన్నారు. మూలా నక్షత్రం రోజున సుమారు 2 లక్షల 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరు సుఖంగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలని కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని, విజయవాడ కనకదుర్గమ్మను వేడుకుంటున్నానన్నారు. కుమ్మరిపాలెం సెంటర్ లోని టిటిడికి చెందిన స్థలంలో చౌల్ట్రీగాని, షెడ్లుగాని నిర్మిస్తామని అలాగే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఎదురుగా వేంచేసియున్న ప్రాచీన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి దాతల సహాయంతో ఆలయాభివృద్ధి గావించి బంగారపు తొడుగు గావిస్తామని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.