YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై భారత్, రష్యా దృష్టి

వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై భారత్, రష్యా దృష్టి

ప్రధాని నరేంద్ర మోదీకి రష్యాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం  మధ్యాహ్నం సోచి నగరం చేరుకున్న మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రధాని మోదీకి రష్యాలో ఇది తొలి అనధికార పర్యటన కావడం విశేషం. పుతిన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశానికి వెళ్లారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక బంధానికి ఈ పర్యటన తార్కాణమని నేతలిద్దరూ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడితో తాను జరిపే చర్చలు ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంగ్లిష్‌‌తో పాటు రష్యన్‌లోనూ ఆయన ట్వీట్ చేశారు.మైత్రీపూర్వక రష్యా ప్రజలకు వందనం. పుతిన్‌ను ఎప్పుడు కలుసుకున్నా.. నాకు అదొక సంతోషం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఉగ్రవాదం, త్వరలో జరగనున్న ఎస్‌సీవో, బ్రిక్స్‌ సదస్సులతో పాటు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌ చర్చిస్తారని సమాచారం. సుదీర్ఘంగా సాగే భేటీలో రక్షణ రంగంలో రష్యాపై అమెరికా ఆంక్షల ప్రభావం, ఇరు దేశాల మధ్య ఆయుధాల వ్యాపారం కూడా చర్చకువచ్చే అవకాశం ఉంది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత రష్యాలో మోదీ 4 పర్యాయాలు అధికారిక పర్యటన చేపట్టారు. గతేడాది జూన్‌లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు. తాజాగా అనధికార పర్యటనకు ఆ దేశానికి వెళ్లారు. ఇటీవలే చైనాలో అనధికార పర్యటన చేపట్టిన మోదీ.. తాజాగా రష్యాలో అనధికారికంగా పర్యటిస్తుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Posts