విజయవాడ, అక్టోబరు 6,
చిరంజీవి.. రాజకీయంగా తన మద్దతు ఎవరికన్నది కుండ బద్దలు కొట్టేశారు. బీజేపీకి దగ్గరౌతున్నారనీ, కాదు కాదు ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారనీ, అసలు రాజకీయాలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయం లేదనీ, సినిమాలే ఆయన ప్రపంచమనీ ఇలా ఇప్పటి దాకా ఎవరికి తోచిన బాష్యాలు వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చిరంజీవి తన మనసులో మాట ఏమిటో కొంచం తడబడుతూ అయినా స్పష్టంగా చెప్పేశారు. అదీ రాజకీయంగా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ క్రియోట్ చేస్తుందన్న అంచనాలున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో ఆయన ఈ రాజకీయ ప్రకటన చేసేశారు. చిరంజీవి తాను ఏ గట్టునున్నాడో చెప్పేశారు. రాజకీయాలకు దూరం అంటూనే తన మద్దతు ఎవరికో ప్రకటించేశారు. తమ్ముడి కోసమే తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. ఇంతకీ ప్రజారాజ్యం స్థాపించిన ఆయన ఆ తరువాత పరిణామాలలో పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయినా.. ఇప్పటికింకా ఆయన సాంకేతికంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. అది నిజం. అయినా సరే ఆయన తన మద్దతు తమ్ముడికే ఉందని నిర్ద్వంద్వంగా ప్రకటిచేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిబద్ధత ఏమిటో తనకు చిన్నప్పటి నుంచీ తెలుసునని అంటూ, పవన్ కల్యాణ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు, రాష్ట్రాన్ని పాలించేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని చెప్పారు.అలాంటి అధికారాన్ని ప్రజలు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూనే తనదైన స్టైల్ లో పిలుపు నిచ్చేశారు. ప్రస్తుతానికి అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని పునరుద్ఘాటిస్తూనే ఏమో భవిష్యత్ లో జనసేనకు జై కొడతానేమో, ఆ పార్టీకి మద్దతు ఇస్తానేమో అంటూ తన రాజకీయ మార్గమేమిటన్నది వెల్లడించేశారు. రాజకీయాలలో తానో గట్టున, తమ్ముడో గట్టునా ఉండటం కంటే అంటే తమ్ముడూ నేనూ రాజకీయంగా చెరోగట్టునా ఉండటం కంటే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే పవన్ కు హెల్ప్ అవుతుందని చిరంజీవి అన్నారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడిక తాను తన తమ్ముడి వైపే నిలబడతాననీ చెప్పకనే చెప్పేశారు.ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. చిరంజీవి జనసేన పార్టీపై ఇప్పటి వరకూ పన్నెత్తి మాట్లాడలేదు. దీంతో ఆయన జనసేన పట్ల అయిష్టతతో ఉన్నారన్న ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. వైసీపీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారన్న వార్తలూ వెల్లువెత్తాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టేశారు.