విశాఖపట్టణం, అక్టోబరు 10,
అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఇందుకోసం అవసరమైతే అంబేడ్కర్ పేరు విషయంలో కోనసీమలో జరిగిన విధ్వంసం సీన్ ను ఉత్తరాంధ్రలో రిపీట్ చేయడానికైనా వెనుకాడని విధంగా వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే మూడు రాజధానుల వ్యవహారంపై వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు డ్రామాలు మొదలు పెట్టేశారు. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టూ అరసవిల్లి పాదయాత్రతో వైసీపీ నేత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగుపెడుతున్నాయి. దీంతో వారేం మాట్లాడుతున్నారో వారికే తెలియని విధంగా వారి మాటలు, ప్రసంగాలు ఉంటున్నాయి. పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించకుండా అడ్డుకోవాలన్న ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమం అంటున్నారు. పదవులకు రాజీనామాలంటున్నారు. ఈ క్రమంలోనే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వికేంద్రీకరణ సాధన కోసం ఏర్పడిన జేఏసీ ప్రతినిధులకు ధర్మశ్రీ అందజేశారు. అదీ కూడా తప్పుడు ఫార్మాట్‌లో ఉంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.,.టీడీపీ కి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయానికి అనుగుణంగా రాజీనామా చేస్తున్నానని లేఖ ఇచ్చారు. రాజీనామా చేసే ఎమ్మెల్యే తన లేఖలో రాజీనామా చేస్తున్నా అని మాత్రమే చేయాలి. వేరే ఏ ఫార్మాట్‌లో రాజీనామా చేసినా అది చెల్లదు. కానీ ధర్మశ్రీ.. కారణాలు, ఉద్దేశాలు రాజీనామా లేఖలో రాశారు. అదికూడా నేరుగా స్పీకర్ కు కాకుండా వికేంద్రీకరణ జేఏసీ ప్రతినిథులకు ఇచ్చారు. ఇక అంతకు ముందు అమరావతి రైతుల పాదయాత్రపై విద్యాశాఖ మంత్రి, ఉత్తరాంధ్రకే చెందిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎవరి కోసం ఈ పాదయాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని మరోసారి చెప్పారు. అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కూడా తన వంతు పాత్ర పోషించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడం చంద్రబాబుకు, ఆయన అనుచరులకు ఇష్టం లేదంటూ విమర్శించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతే ఏకైక రాజధాని అంటూ మహా పాదయాత్రగా వస్తున్న వారిని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమంటూ హెచ్చరికలు చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా చేయడానికైనా సిద్ధమంటూ కృష్ణదాస్ చెబుతున్నారు.ఇక కృష్ణదాస్ సోదరుడు, ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ అనుమతి ఇస్తే.. విశాఖ రాజధానికి అనుకూలంగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసి, వికేంద్రీకరణ ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. విశాఖ రాజధానికి అడ్డొచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. ఉత్తరాంధ్ర పీక కోసేందుకే అమరావతి నుంచి అరసవిల్లికి యాత్రగా వస్తున్నారని ధర్మాన మండిపాటు ప్రదర్శించారు. చెన్నై నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్ కు రాజధాని వెళ్తే నోరెత్తని వారు విశాఖకు రాజధాని వస్తుంటే అడ్డు చెబుతారా? అని నిలదీస్తున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటైతేనే ఉత్తరాంధ్రకు భవిష్యత్తు అంటూ ఆ ప్రాంత ప్రజలను మెస్మరైజ్ చేసేందుకు యత్నించారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ మరో అడుగు ముందుకేసి అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు పోటీగా మరో పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు. వివాదాస్పదం అయిన అమరావతి రైతుల పాదయాత్ర ఆపేయాలని అమర్నాథ్ అంటున్నారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతా వారు కూడా ప్రత్యేక రాష్ట్రాలు కోరతారంటూ ఓ వితండ వాదాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. ఇక వైసీపీ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయితే.. ‘పాదయాత్ర పేరుతో దండయాత్రకు వచ్చే వారిని అడ్డుకోవాలి’అంటూ పిలుపునిచ్చేందుకు తెగించారు. మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంద్రకు చెందిన వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెట్టేసరికి అలజడులు సృష్టించే విధంగా వైసీపీ నేతలు, మంత్రులు అడ్డగోలు యత్నాలు చేస్తున్నారు. వికేంద్రీకరణకు అనుకూలంగా రాజీనామా చేస్తామని ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు ప్రకటన చేశారు. అయితే వైసీపీ ఎంతగా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా మహాపాదయాత్రకు ప్రజామద్దతు విశేషంగా లభిస్తోంది. గోదావరి జిల్లాల్లో మూడు రాజధానులకు మద్దతుగా, అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు ఎవరికీ పట్టని తేనీటి సమావేశాల్లా మిగిలిపోవడంతో.. ఇక అలజడులు సృష్టించైనా సరే మహాపాదయాత్రను అడ్డుకోవాలన్న నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లు కనిపిస్తున్నది. రెచ్చగొట్టే ప్రకటనల అనంతరం.. కొనసీమ సీన్ ను ఉత్తరాంధ్రలో రిపీట్ చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ ఉన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ వైసీపీ స్పాన్సర్డ్ అల్లర్లు జరిగిన విధంగానే ఇప్పుడు మహాపాదయాత్రను అడ్డుకోవడానికి మరో సారి అలాంటి స్పాన్సర్డ్ అల్లర్లకు వైసీపీ వ్యూహరచన చేస్తున్నదా అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తమౌతున్నాయి.