విజయవాడ, అక్టోబరు 10,
ఆంధ్రప్రదేశ్ జనం ఏ మాత్రం అంగీకరించని, ఆమోదించని విషయం ఏదైనా ఉంటుందంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రమే. సీమాంధ్రులకు ఏ మాత్రం అంగీకార యోగ్యం కాని, ఆమోదయోగ్యం కాని విభజనను బలవంతంగా నెత్తిమీద రుద్దారు.ఆ ఆగ్రహం ప్రతి సీమాంధ్రుడిలోనూ ఉంది. అందుకే విభజనకు అంగీకరించి, ఆమోదించి, విభజనను సాకారం చేసిన కాంగ్రెస్ కు ఏపీలో ఉనికి లేకుండా చేశారు. కనీసం విభజన సమస్యలను పరిష్కరించి, విభజన సందర్బంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్న ఆశలను వమ్ము చేసిన బీజేపీకి 2019 ఎన్నికలలో అదే గుణ పాఠం చెప్పారు.అసెంబ్లీలో కనీసం ప్రాతినిథ్యం లేకుండా చేశారు. ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ విభజన గాయాల గురించి కనీసం పట్టించుకోలేదు సరికదా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తాన అంటే తందానా అంటూ తన పబ్బం గడుపుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఈ తరుణంలో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో తగుదునమ్మా అంటూ ఏపీలో ప్రవేశిస్తానంటే అంగీకరిస్తారా? దశాబ్దాల పాటు తిరుగులేని అధికారాన్ని ఇచ్చి ఆదరించిన కాంగ్రెస్ నే విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోదిలోకి లేకుండా బుద్ధి చెప్పారు. గత రెండు ఎన్నికలలోనే కాదు సమీప భవిష్యత్ లో కాంగ్రెస్ ఏపీలో ప్రభావమంతమైన రాజకీయ పార్టీగా ఎదుగుతుందన్న నమ్మకం పరిశీలకులలోనే కాదు.. కాంగ్రెస్ పార్టీలోనూ లేదు.ఇక బీజేపీకి.. 2014 ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తు ఉండటమొక్కటే కాదు.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి జరిగిన నష్టాలను ఏదో మేరకు పూడుస్తుందన్న విశ్వాసంతోనే ఆదరించారనడంలో సందేహం లేదు. అయితే ఏపీ జీవనాడి పోలవరం సహా అన్ని ఆశలనూ బీజేపీ వమ్ము చేసింది. దీంతో 2019 ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం లేకుండా చేశారు. ఇప్పుడు విభజన కోసమే ఉద్యమించి, విభజన వద్దంటున్న సీమాంధ్రులపై నిప్పులు చెరిగి, విభజన సాకారం అయిన తరువాత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్ పై నిప్పులు చెరుగుతూ ఏపీ ప్రయోజనాలకు అడుగడుగునా గండి కొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ఏపీలో కాలుపెడతాననడం పాత గాయాలను కెలకడంగానే ఆంధ్రులు భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అరకొరగా అక్కడక్కడా బీఆర్ఎస్ పోస్టర్లు వెలిసినంత మాత్రాన ఏపీలో బీఆర్ఎస్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారని భావించడానికి వీల్లేదని అంటున్నారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను ఓ ముగ్గురు నేతలకు అప్పగించేసి ఇక రాష్ట్రంలో పాగా వేసినట్లేనని కేసీఆర్ భావించడం వాస్తవాన్ని విస్మరించి ఊహలలో విహరించడంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు. వాస్తవానికి ఇప్పటికీ విభజన పట్ల, ఆ విభజన జరిగిన తీరు పట్లా ఆంధ్రులలో అలవిమాలిన కోపం అలాగే ఉంది. అడ్డగోలు విభజన చేసిందనే కాంగ్రెస్ కి ఏపీలో స్థానం లేకుండా చేశారు. విభజన హామీలునెరవేర్చడం అటుంచి, న్యాయంగా రావాల్సిన వాటికి కూడా మోకాలడ్డిన బీజేపీకి 2019 ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారు. ఏపీలో 2019 ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే బీజేపీ పట్ల ఆంధ్రుల తిరస్కారం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇక ఇప్పుడు విభజనకు కర్త, కర్మ, క్రియ తానేనని చాటుకునే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ఏపీలోకి అడుగుపెడితే ఆయన భాషలోనే చెప్పాలంటే కిర్రికాల్చి వాత పెట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. విభజన చేసిన పాపానికి మద్దతు ఇచ్చిన నేరానికి కాంగ్రెస్ బీజేపీలకు పాతరేసిన ఏపీ జనం కేసీఆర్ ను ఎంత మాత్రం ఉపేక్షించే అవకాశం లేదనీ, ఏపీలో బీఆర్ఎస్ ముసుగులో రావాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ను తగిన గుణపాఠం చెబుతారనడంలో సందేహం లేదనీ అంటున్నారు.