విజయవాడ, అక్టోబరు 11,
జగన్ రెడ్డి ప్రభుత్వం దేవుళ్ళను కూడా వదిలి పెట్టడం లేదు. అఫ్కోర్స్ దేవుళ్లంటే అందరు దేవుళ్లు, అన్ని మతాల దేవుళ్ళు కాదు ఓన్లీ హిందూ దేవుళ్లు, దేవాలయాల ఆదాయం పైనే జగన్ రెడ్డి ప్రభుత్వం కన్ను పడింది. భక్తుల జేబుల కత్తిరించేందుకు సిద్దమైంది.కొద్ది రోజుల క్రితం కాణిపాకం వరరసిద్ధి వినాయకుని దేవాలయంలో నిత్యం జరిగే, పంచామృత అభిషేకం టికెట్ ధరను ఒక్క సారిగా, రూ. 750 నుంచి రూ.5000లకు పెంచారు. అయితే భక్తులు హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు దిగడంతో, అబ్బే అదేమీ లేదు అలా పెంచితే ఎలా ఉంటుందని భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే బోర్డు పెట్టామని, అధికారులు సంజాయిషీ ఇచ్చుకున్నారు. అయితే అధికారులు చెబుతున్నదే నిజం అయితే దేవాలయం ఈఓను ఎందుకు బదిలీ చేశారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. అదలా ఉంటే, ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సర్కార్ స్వాములు సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని మరింత దూరం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దసరాలో వీఐపీల కోసం అంటూ టికెట్ ధరను పెంచడం.. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసినా అదే కొనసాగించేయడంతో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనానికి దూరమవుతున్నారు. అయితే ఇది ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం వస్తున్నదే అని భక్తులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. గత సంవత్సం దర్శనం టికెట్ ధరలు రూ.50, రూ.100 ఉండగా.. దసరాలో వీఐపీ టికెట్ అంటూ రూ.300 పెట్టారు.ఆ తర్వాత దసరా ముగిసినా.. టికెట్ మాత్రం తగ్గించలేదు. అంతరాలయం రూ.100 టికెట్‌ను రూ.300కు ఒకేసారి రెండు రెట్లు పెంచేశారు. రూ.50 టికెట్ తీసేసి.. రూ.100 చేశారు. దానిపైనే తీవ్ర విమర్శలు రావడం, అప్పటి పాలకమండలి సభ్యులు సైతం వ్యతిరేకించడంతో ఇదిగో తగ్గిస్తాం.. అదిగో తగ్గిస్తామంటూ అప్పటి ఈవో కాలయాపన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.300 టిక్కెటే భారంగా మారిందని భక్తులు బాధపడుతుంటే, ఈ సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా టికెట్ ధరను ఏకంగా రూ.500కు పెంచేశారు. మరో వంక రూ.30 విలువ చేసే రెండు లడ్డూల ధరను ఒకేసారి రూ.200కు పెంచారు. అంటే భక్తులకు అమ్మ దర్శనమే కాదు, ప్రసాద భాగ్యం లేకుండా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఒక కాణిపాకం, ఒక విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం అని మాత్రమే కాదు, తిరుమల వెంకన్న దేవుడు మొదలు రాష్టంలోని ప్రముఖ ఆలయాలు అన్నింటినీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయ వనరులుగానే చూస్తోందని, మరో వంక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల సహా అన్ని ప్రముఖ ఆలయాలలో అన్యమత జోక్యం పెరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ముడుపులు కట్టి స్వామి వారలకు సంర్పించుకుంటున్న కోట్లాది రూపాయల సొమ్ములను జగన్ రెడ్డి ప్రభుత్వం కొల్ల గొడుతోందని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. హిందూ ధార్మిక కార్యక్రమాలు, హిందూధర్మ ప్రచారం కోసం ఖర్చు చేయవలసిన స్వామి వారి సొమ్మును, అన్యమత ప్రచారానికి, పాస్టర్లు, ఇమాములలకు నెల జీతాలు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, తగ్గేదే ..లే అంటూ దేవుని సొమ్మును యదేచ్చగా కైంకర్యం చేస్తునే వుంది, గుడిని గుడిలో లింగాన్ని మింగే చర్యలకు పాల్పడుతోంది. అయితే ఏదో ఒక రోజు ఆ దేవునికే లెక్కలు చెప్పవలసి వస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నారు.