YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో వికేంద్రీకరణ వేడి

విశాఖలో వికేంద్రీకరణ వేడి

విశాఖపట్టణం, అక్టోబరు 11, 
ఏపీలో  రాజకీయాలు వేడెక్కాయి. డైవర్షన్ పాలిటిక్స్‌ తెర మీదికి వచ్చాయి. మూడు రాజధానుల అంశం దీనికి కేంద్రబిందువు అయింది. మూడు రాజధానుల అంశాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీయేతర పార్టీలు రంగంలోకి దిగాయి. ఈ మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్సీపీ దూకుడును అడ్డుకోవడానికి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్‌లోకి దిగారు.విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించలనే డిమాండ్‌తో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జనను చేపట్టనుంది ఈ నాన్ పొలిటికల్ జేఏసీ. అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, దీనికి మద్దతుగా ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు తెలిపింది. విశాఖను రాజధానిగా బదలాయించడానికి తాము స్వాగతిస్తోన్నామని స్పష్టం చేసింది. ఎల్‌ఐసీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది.రాజధాని సాధనలో అత్యంత కీలకంగా భావిస్తోన్న ఈ విశాఖ గర్జనపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌ను అందుకున్నారు. దేనికి గర్జనలు అంటు ప్రశ్నించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌పై వరుస పోస్టులు పెట్టారు. మూడు రాజధానులతో రాష్ట్రం ఇంకా అధోగతి పాలవుతుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాటానికా ఈ గర్జనలు అంటూ ప్రశ్నించారు.ట్వీట్లు చేయడం వరకే పరిమితం కాలేదు పవన్ కల్యాణ్. ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. దీనికి అవసరమైన షెడ్యూల్‌ను కూడా జనసేన పార్టీ విడుదల చేసింది. జనసేన - జనవాణి కార్యక్రమాన్ని కూడా ఇందులోనే పొందుపరిచింది. మూడు రోజుల్లో మూడు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలను చుట్టేయబోతోన్నారు. పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొనబోతోన్నారు.నాన్ పొలిటికల్ జేఏసీ గర్జనను నిర్వహించ తలపెట్టిన రోజే పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆ రోజంతా ఆయన అక్కడే ఉంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా సమావేశమౌతారు. రోడ్ షోలో పాల్గొంటారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఆయన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. ఒక వంక విశాఖ గర్జన ఆందోళనను ప్రతిపాదించిన రోజే పవన్ కల్యాణ్ అదే విశాఖలో పర్యటించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.16,17 తేదీల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తారు. 16వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 17వ తేదీన శ్రీకాకుళంలో పార్టీ నాయకులతో సమావేశమౌతారు. చివరిగా తిరుపతిలో జనసేన - జనవాణి ఏర్పాటైంది. ఇప్పుడు మళ్లీ దీన్ని విజయనగరంలో నిర్వహించబోతోన్నారాయన.పవన్ కల్యాణ్ తలపెట్టిన ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తోన్నారు. ఇన్ని రోజులు పొరుగు రాష్ట్రంలో ఉంటూ విశాఖ గర్జనను నిర్వహించ తలపెట్టిన రోజే పవన్ కల్యాణ్ రోడ్డెక్కుతున్నారని, దీని వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపిస్తోన్నారు. మూడు రాజధానులను అంశాన్ని పక్కదారి పట్టించడానికే ఆయన ఈ పర్యటనకు పూనుకున్నారని విమర్శిస్తోన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ధ్వజమెత్తుతున్నారు.

Related Posts