గుంటూరు, అక్టోబరు 11,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్త అయిన రాయపాటి సాంబశివరావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో లావు కృష్ణదేవరాయలు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదు. తనతోపాటు తన కుమారుడికి కూడా సీటు కావాలంటున్న రాయపాటి రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు సత్తెనపల్లి నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. తన కుమారుడికి సత్తెనపల్లి సీటు కావాలంటూ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కానీ అధిష్ఠానం నుంచి స్పందన రాలేదు. తనతోపాటు తన కుమారుడికి కూడా సీటివ్వమని అడుతున్నారు. ఇటీవలే చంద్రబాబు నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 125 స్థానాలు వస్తాయని చెప్పారు. పొత్తు ఉన్నా, పొత్తు లేకున్నా ఇదే ఫలితం వస్తుందని ఢంకా భజాయించారు. తన కుమారుడికి సీటు అడుగుతుంటే అసలు ఎవ్వరికీ ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చిచెప్పినట్లు రాయపాటి వర్గం చెబుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం రంగారావు పనిచేసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన నెమ్మదించారు. రంగారావుతోపాటు చలపతి ఆంజనేయులు, అబ్బూరి మల్లేశ్వరరావు, కోడల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం పనిచేసుకుంటున్నారు. సీటు రాదని ఖరారు చేసుకున్న తర్వాతే రాయపాటి బీజేపీవైపు దృష్టి సారించారు. గుంటూరులో ఉన్న సోము వీర్రాజు ముఖ్యమైన అనుచరుడితో రాయపాటి సంభాషించారు. తనతోపాటు తన కుమారుడికి సీటివ్వాలనే ప్రతిపాదన పెట్టారు. ఈ విషయమై త్వరలో స్పష్టత ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.అంగబలం, ఆర్థిక బలం ఉన్న వ్యక్తుల కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో రాయపాటి వస్తే తమకు మంచిదనే ఉద్దేశంలో ఆ పార్టీనేతలున్నారు. తాను గెలవడంతోపాటు మరో ఇద్దరు అభ్యర్థులను గెలిపించగలిగే రాయపాటి లాంటి వ్యక్తులు మరికొంతమంది వస్తే బీజేపీ ఏపీలో కూడా బలోపేతమవుతుందనే ఉద్దేశంలో కమలం నేతలున్నారు. ఏపీలో వైసీపీకి వెళ్లలేనివారికి, టీడీపీలో సీటు రానివారికి బీజేపీ ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. భవిష్యత్తులో మరెంతమంది నేతలు కమలం తలుపు తడతారో వేచిచూడాలి.