అనంతపురం, అక్టోబరు 11,
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థి- రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని చూస్తూంటాం. సాధారణంగా ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన నాయకులు ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటూంటారు. ఒక్క చోట ఓడినప్పటికీ- మరో చోట గెలవొచ్చనే విశ్వాసంతో రెండు స్థానాల్లో పోటీలో ఉంటుంటారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేశారు. గుజరాత్‌లోని వడోదర, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశి నుంచి బరిలో దిగారు. రెండు చోట్ల పోటీ.. వారణాశిలో గెలవడంతో వడోదర స్థానానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ.. రెండు సీట్లల్లో పోటీ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేసి ఒకదాంట్లో ఓడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గాజువాక, భీమవరంలల్లో పోటీ చేసి.. రెండింట్లోనూ పరాజయాన్ని చవి చూశారు. 2024లోనూ ఆయన రెండు చోట్ల పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గానీ రెండు స్థానాల్లో పోటీ చేసిన సందర్భాలు లేవు. ఈ సారి మాత్రం చంద్రబాబు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో- ఆయన మరో నియోజకవర్గాన్ని కూడా వెదుక్కుంటున్నారనే సమాచారం ఉంది. కుప్పంతో పాటు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తోంది.. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్.. కీలక ప్రతిపాదనలను తెర మీదికి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక అభ్యర్థి- ఒకే నియోజకవర్గంలో పోటీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కూడా. ప్రస్తుతం ఇవి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. దీనిపై ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. 2004లో తొలిసారిగా.. 2004లో తొలిసారిగా ఈసీ దీన్ని ప్రతిపాదించింది. రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 33 ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకే నియోజకవర్గంలో పోటీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ అపాయింట్ అయిన కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. 18 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ ప్రతిపాదనల దుమ్ము దులిపారాయన. ఇదివరకు ఒక అభ్యర్థి మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసే వీలు ఉండేది. 1994లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దీన్ని సవరించి- రెండుకు పరిమితం చేసింది.