YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో రాజీనామాలు డ్రామాలు...

వైసీపీలో రాజీనామాలు డ్రామాలు...

విశాఖపట్టణం, అక్టోబరు 12, 
నిజానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదు. ఒక వేళ ఎవరైనా అలాంటి డిమాండ్ చేసినా పట్టించుకోవలసిన అవసరం లేదు. రాజధాని సమస్య ఒక్క ఉత్తరాధ్రకో, మరో ప్రాంతానికో మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఐదు కోట్ల ఆంధ్రులకు సంబందించిన విషయం. నిజానికి, రాష్ట్ర విభజన అనంతరం గత టీడీపీ ప్రభుత్వం అందరి ఆమోదంతో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించింది.ఈ మేరకు  రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ  తీర్మానం చేసింది. ప్రతిపక్ష నేతగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా శాసన సభలో అమరావతి ఏకైక రాజధానిగా అంగీకరించారు. రాజధాని తీర్మానానికి వైసీపీ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రకటన చేసింది. అక్కడితో, ఏపీ రాజధాని చర్చ ముగిసిపోయిందనే  అందరూ అనుకున్నారు. నిర్మాణ పనులు మొదలయ్యాయి , కొంతవరకు పూర్తయ్యాయి. అసెంబ్లీ, సెక్రటేరియట్, హై కోర్ట్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడి నుంచే పరిపాలన సాగిస్తోంది.  అయితే  వైసీపే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పని మడమ తిప్పని వంశంలో పుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు, మడమ తిప్పారు. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఆలోచనను తెర పైకి తెచ్చి తేనే తుట్టెను కదిల్చారు. రావణ కాష్టం రగిల్చారు. దీంతో  రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ళు అయినా, రాజధాని చుట్టూనే రాజకీయం నడుస్తోంది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన మూడు సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల మంటలను రాజేయడమే కాకుండా ఏ విషయంలోనూ స్థిరమైన అభిప్రాయం లేకుండా పిల్లి మొగ్గలు వేస్తున్నారు.అసెంబ్లీ తీర్మానం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్  కోర్టు తీర్పులు ఏవీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకునే కుట్రలకు తెరతీశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అన్యాయంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రైతులు చేస్తున్న పాద యాత్రకు అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారు.  మరో వంక అమరావతి రైతుల ధర్మ పోరాటాన్ని అడ్డుకునేందుకు   ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతో, మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మానవ హారాలు, ర్యాలీలు అంటూ వైసీపీ శ్రేణులు వీధుల్లోకి వచ్చాయి. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామలంటూ గర్జించారు. సవాళ్ళు విసిరారు.కానీ, అంతలోనే మళ్ళీ వెనకడుగు వేశారు. మూడు రాజధానుల కోసం రాజీనామాలకు సిద్దం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన తర్వాతి రోజే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖ మూడు రాజధానుల జేఏసీకి అందజేశారు. ఆ వెంటనే,ఇతర ఎమ్మెల్యేలు కూడా తాము సైతం రాజీనామాలకు సిద్ధమన్నారు. ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు మేము సైతం.. అంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో  గత రెండు మూడు రోజులలో చోటు చేసుక్కున్న పరిణామాలు ఇక మూడు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు రావడమో లేకపోతే నేరుగా ముందస్తు ఎన్నికలు రావడమో ఖాయమన్న వాతావరణం కనిపించింది.  అయితే   ఒక్క రోజులోనే అనూహ్యంగా వైసీపే నేతలు అలవాటుగా మాట తప్పారు, మడమ తిప్పారు. సీనియర్ మంత్రి బొత్స, మరో మంత్రి అమర్నాథ్ రాజీనామాల వల్ల ఏం వస్తుందని ఎదురు ప్రశ్నించారు.  నిజమే,  బొత్స సత్యనారాయణ సెలవిచ్చినట్లుగా అధికార పార్టీ  ఎమ్మెల్యేలో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలో రాజీనామాలు చేయడం వలన ప్రయోజనం ఏం ఉండదు. నిజానికి రాజధాని విషయంలో ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు రాజధానిని మార్చే ప్రశ్నే లేదని,  అమరావతి రాజధానిగా కొనసాగుతుందని వైసీపీ ప్రజలకు హామీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఇల్లు కట్టుకున్నారని, అక్కడే రాజధాని ఉంటుందని ప్రస్తుత మంత్రులు కూడా అప్పట్లో ప్రజలకు హామీ ఇచ్చారు.
జగన్ రెడ్డి సుదీర్ఘంగా సాగించిన పాదయాత్రలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ వైసీపీ నేతలు ఎవరూ మూడు రాజధానుల ముచ్చట కాదు కదా అధికార వికేంద్రీకరణ అనే మాటనే తీసుకోలేదు. కాబట్టి   ఇచ్చిన మాట తప్పిన వైసీపీ ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలనీ, మూడు రాజధానుల ఎజెండాగా మళ్లీ ఎన్నికలకు వెళదాం రమ్మని తెలుగుదేశం సవాల్ చేస్తోంది. ఇప్పడు బంతి వైసీపీ కోర్టులో వుంది. మంత్రులూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా విషయంలో వెనకడుగు వేయడంతో టీడీపీ మరింత గట్టిగా అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు  రావాలని వైసీపీని డిమాండ్ చేస్తోంది. దీంతో వైసీపీ కుడితిలో పడిన ఎలుకల కొట్టుకుంటోంది.

Related Posts