YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప‌ర్యావ‌ర‌ణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధికి వ్య‌తిరేకం అధికారంలోకి వ‌స్తే సోంపేట బీల భూముల స‌మ‌స్యకు పరిష్కారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్

ప‌ర్యావ‌ర‌ణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధికి వ్య‌తిరేకం అధికారంలోకి వ‌స్తే సోంపేట బీల భూముల స‌మ‌స్యకు పరిష్కారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్

ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించుకునే అభివృద్ధి కావాలి గానీ.. ప‌ర్యావ‌ర‌ణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధికి త‌మ పార్టీ వ్య‌తిరేక‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పష్టం చేశారు.  జ‌న‌సేన‌ పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో  ప‌ర్యటిస్తున్న ఆయన..  సోంపేటలోని రైతుల‌తో కలిసి పోలీసు కాల్పుల్లో మ‌ర‌ణించిన అమ‌ర‌వీరుల‌కు నివాళులు  అర్పించారు.  ఈ పోరులో అమరులైనవారి కుటుంబాలకి తక్షణం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన  పవన్ కళ్యాణ్  "జనసేన అధికారంలోకి   వస్తే సోంపేట బీల భూముల సమస్యను పరిష్కరిస్తాం.  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం పోరాటం చేసే వారిపై కాల్పులు జ‌ర‌ప‌డం బాధ‌ క‌లిగించింది.  ఇక్క‌డి చిత్త‌డి నేల‌ల్లో  రొయ్య‌ల చెరువులు త‌వ్వ‌డం వ‌ల్ల ఉష్టోగ్ర‌త‌లు పెరిగి, భూగ‌ర్భ జ‌లాలు క‌లుషిత‌మ‌వుతున్నాయి. దేశం బాగుండాలంటే ప్ర‌జ‌లు బాగుండాలి త‌ప్ప.. నోట్ల క‌ట్ట‌ల‌ మీద ఆశ‌తో  కొద్ది మంది అభివృద్ధి కోసం ఇంత మంది జీవితాల‌ను నాశ‌నం చేస్తామంటే చూస్తూ ఉరుకోబోము. ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తినేలా, ఒక పద్దతి లేకుండా  ప్ర‌భుత్వాలు ఇష్టారాజ్యంగా ప‌ర్మిష‌న్లు ఇస్తే త‌ర్వాత తాగ‌డానికి నీళ్లు, తిన‌డానికి తిండి కూడ దొరకని పరిస్థితులు వస్తాయి" అన్నారు. అభిమానులు సీఎం సీఎం అని నినాదాలు చేస్తుంటే "మీ అరుపులు, కేక‌లు స‌మ‌స్య‌లు తీర్చేలా ఉండాలి త‌ప్ప‌, స‌మ‌స్య‌ను పెంచేలా ఉండ‌కూడ‌దు జ‌న‌సైనికులు సోంపేటలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించాలి. అలాగే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ స‌మితి పోరాటాల‌కు అండ‌గా ఉండాలి" అని  చెప్పారు.  అంత‌కు ముందు  ఇచ్ఛాపురంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయిన  ప‌వ‌న్  పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బ‌లోపేతంపై చ‌ర్చించారు.

Related Posts