గుంటూరు, అక్టోబరు 13,
రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కానీ క్రియాశీలకంగా లేరు. వయసు మీద పడిన కారణంగా ఆయన ఇప్పుడు స్లో అయినా మొన్నటి వరకూ గుంటూరు రాజకీయాలను ఒక ఆట ఆడుకునే వారు. రాయపాటి ఆషామాషీ నేత కాదు. 1982లోనే మొదటి సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలే. అతి చిన్న వయసులో పెద్దల సభలో అడుగుపెట్టిన రాయపాటి సాంబశివరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ లో ఆయన తిరుగులేని నేతగా దశాబ్దాల పాటు ఏలారనే చెప్పాలి. 1996, 1998, 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరుపున పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2014లో రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్ ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2014లో ఆయన నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2019లో ఆయన టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీలో క్రియాశీలకంగా మారదామనుకున్న రాయపాటికి అనారోగ్యం, వృద్ధాప్యం కొంత ఇబ్బందిగా మారింది. ఇక తాను రాజకీయాలు చేయలేని భావించి వారసులను తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తన వారసుడు రాయపాటి రంగారావుకు ఆయన సత్తెనపల్లి టిక్కెట్ ను కోరుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంత వరకూ తేల్చలేదు. అక్కడ ఇన్ ఛార్జిని కూడా నియమించలేదు. అక్కడ కోడెల శివరామ్ ఉండటంతో చంద్రబాబు ఎవరినీ ఇన్ ఛార్జిని నియమించకుండా నెట్టుకొస్తున్నారు. సత్తెనపల్లి కాకపోయినా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ అయినా ఇవ్వమని కోరుతున్నారు. కానీ ఆ సీటు కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. ఇతర పార్టీలతో పొత్తు కుదిరితే అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెడీగా ఉన్నారు. ముందుగానే ఆయన కర్చీఫ్ వేసి కూర్చుని ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాకుంటే కనీసం పెదకూరపాడు నియోజకవర్గమైనా రంగారావుకు ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు చంద్రబాబును కోరినట్లు తెలిసింది. అయితే అక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. దీంతో రాయపాటి రంగారావుకు వచ్చే ఎన్నికల్లో గుంటూరు, నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఖారారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నరసరావుపేట స్థానం ఎటూ ఖాళీగా ఉంది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు రాయపాటి రంగారావుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక గుంటూరు ఎంపీ జయదేవ్ ను ఈసారి చంద్రగిరి నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నారు. అక్కడి నుంచైనా పోటీ చేసే వీలుంది. కానీ రాయపాటి రంగారావు మనసంతా అసెంబ్లీ ఎన్నికల బరిలోనే ఉంది. చివరకు పోట్లాడి అసెంబ్లీ టిక్కెట్ సాధించుకుంటారా? లేక పార్లమెంటుకు పోటీ చేస్తారా? అన్నది భవిష్యత్ లో తేలనుంది.