విజయవాడ, అక్టోబరు14,
ఒక జర్నలిస్ట్ కు సొంతంగా పత్రిక లేదా ఓ వెబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? సహజంగా, ఉన్న ఉద్యోగం ఊడి, కొత్త ఉద్యోగం ఏదీ దొరకని సమయంలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే, సొంతంగా ఏదో ఒకటి చేద్దామనే అలోచన పుడుతుంది. సరే, ఆలా ఆలోచన చేసిన జర్నలిస్టులు చాలా వరకు చేతులు కాల్చుకుని మళ్ళీ చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో సర్దుకుపోయిన వారే అనుకోండి, అది వేరే విషయం. జర్నలిస్టుల విషయాన్ని కాసేపు పక్కన పెట్టి రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఉన్న పార్టీలో ఉక్కపోత మొదలై, పక్క పార్టీలతో పని కాదనుకున్నప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తారు. అఫ్కోర్స్ అక్కడా సక్సెస్ రేటు తక్కువే అనుకోండి. అయినా ఉన్న పార్టీలో ఉక్కపోత తట్టుకోలేక సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన చేసే రాజకీయ నాయకులు మంచి కాసుల పార్టీ అయితే, పార్టీ కంటే ముందే సొంతంగా ఒక న్యూస్ పేపర్, ఒక న్యూస్ చానల్ ప్లాన్ చేస్తారు. అందుకే కావచ్చును వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు హటాత్తుగా సొంతగా న్యూస్ చానల్ పెడుతున్నానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. విజయసాయి, సొంత చానల్ తో ఆగుతారా, సొంత పార్టీ వరకు వెళతారా అనే చర్చ, వైసీపీ వర్గాల్లోనే మొదలైందని అంటున్నారు. అంతే కాదు,ఢిల్లీ స్థాయిలో ఇందుకు సంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరిగిందని వైసీపీలో వినవస్తోంది. వైఎస్ కుటుంబ సభ్యులను ముందుంచి, విజయసాయి రాజకీయంగా ముందదుగు వేసే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని అంటున్నారు. ఢిల్లీ పెద్దలతో పాటుగా పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేత ఒకరు తెర వెనక నుంచ కథ నడిపిస్తునట్లు తెలుస్తోంది. అందుకే, విజయ సాయి, ఓపెన్ గా చానల్ పెడుతున్నానని ప్రకటించారని అంటున్నారు. జగన్ రెడ్డితో చక్కని ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అటువంటప్పుడు వైసీపీకి ఇప్పుడు మరో చానల్ అవసరం ఏమొచ్చింది? అంటే, ఛానల్ అవసరం వచ్చింది వైసీపీకి కాదు. జగన్ రెడ్డికీ కాదు విజయ సాయి రెడ్డికే ఆ అవసరం వచ్చిందని లోగుట్టు తెలిసిన, విజయసాయి సన్నిహిత మీడియా మిత్రులు చెపుతున్న మాట.నిజమే కారణాలు ఏవైనా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు. అదీ తెలుస్తూనే వుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతం, ఫ్లడ్ గేట్స్ తెరిచినట్లుగా బయటకు వస్తోంది. విజయ సాయి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ ఆయనకు అండగా నిలవడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించడం లేదు. నిజానికి, విజయసాయిరెడ్డి భూదందాల వ్యవహారాలన్నీ ప్రభుత్వ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయని అంటున్నారు. విజయసాయి రెడ్డికి సీన్ అర్ధమైందని అంటున్నారు. అందుకే నెపాన్ని సాక్షిపై నెట్టి చానల్ ఆలోచనను బయట పెట్టారని అంటున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను సాక్షి టీవీ సమర్ధవంతంగా తిప్పి కొట్టడంలో విఫల మవుతోందని, అందుకే తాను చానల్ పెడుతున్నానని చెప్పుకొచ్చారు. నిజానికి జగన్ రెడ్డి, విజయ సాయి మధ్య చాలా కాలంగా ప్రచ్చన్న యుద్ధం సాగుతోందని, ఏదో ఒక రోజున ప్రచ్చన యుద్ధం ప్రత్యక్షయుద్ధంగా మారక తప్పదని అంటున్నారు. అది గ్రహించే విజయ సాయి యుద్ద సన్నాహాలు ప్రారంభించారని అంటున్నారు. నిజానికి వైసీపీ సీనియర్ నేతలు చాలా మందిలో అసమ్మతి బుసలు కొడుతోంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రిపై కంటే, ముఖ్యమంత్రి చుట్టూ చేరిన కోటరీపై పార్టీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రిని వారే తప్పుదారి పట్టిస్తున్నారని అంటున్నారు