న్యూయార్క్, అక్టోబరు 14,
అమెరికాలో కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అగ్రరాజ్యంలో తాజాగా మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని రాలీ నగరంలో కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించారు. రాలీ నగరానికి ఇది విచారకరమైన, విషాదకరమైన రోజు అని నగర మేయర్ మేరీ ఆన్ బాల్డ్విన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో ఈ బుద్ధిహీనమైన హింసను ఆపాలంటూ బాల్డ్విన్ వెల్లడించారు.ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించారని, వారిలో ఒకరు పోలీసు అధికారి అని యూఎస్ మీడియా నివేదికలు తెలిపాయి. ఇంతకు ముందు కూడా ఈ నివాస ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. పలు ప్రాంతాల్లో నివాసముంటున్న వారు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.”ఈ ఘటనపై విచారణ చేపట్టాం. హెడింగ్‌హామ్ పరిసరాల్లోని విభాగాలు మూసివేయబడ్డాయి. నివాసితులు అధికారుల ఆదేశాలను పాటించాలి” అని రాలీ పోలీసులు ట్వీట్ చేశారు. నగర మేయర్‌తో మాట్లాడినట్లు నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ తెలిపారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అధికారులు పని చేస్తున్నారని కూపర్ ట్వీట్ చేశారు.