తిరుపతి, అక్టోబరు 15,
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు మోటార్‌కు మీటర్ పెట్టాల్సిందేనని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే ఉరితాడు బిగించడమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా అదే చెబుతోంది. ఏపీ ప్రభుత్వంలా తాము రైతుల మెడకు ఉరి తాళ్లు వేయడం లేదని అక్కడి రైతులకు తాము ఎంత మంచి చేశామో చెబుతోంది. మీటర్లు పెడితే బిల్లులొస్తాయి..బిల్లులు వస్తే కట్టాల్సింది రైతులే. మోటార్లు కాలిపోయినా.. మరో సమస్య వచ్చినా తంటాలు పడాల్సింది రైతులే. నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా సమయానికి ఇవ్వకపోతే.. రైతుల ఖాతాలోనే బాకీ ఉంటుంది. ఈ ఆందోళనల నడుమ రైతులు కూడా ఇప్పటిదాకా లేని మీటర్ల గొడవ ఇప్పుడెందుకని రైతులు కూడా అనుకుంటున్నారు. అయితే సీఎం మాత్రం మీటర్లు పెట్టాల్సిందేనని అంటున్నారు. రాజకీయంగా ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారోనన్న సందేహం వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,61,302 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించారు. ఇందులో ఎపిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,61,302 మీటర్లు, సిపిడిసిఎల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఐదు లక్షల మీటర్లు, ఎస్‌పిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 11 లక్షల మీటర్లు బిగించనున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,92,980 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం ప్రాంతాల వారీగా చూస్తే అత్యధికంగా రాయలసీమలోనే ఎక్కువ మీటర్లు పెట్టనున్నారు. ఇప్పటికి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మీటర్లను అమర్చారు. సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మీటర్లను ఏర్పాటుచేస్తే కొంత అదనపు రుణాన్ని కూడా ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించింది. దానికి అపీ ప్రభుత్వం అంగీకరించింది. అప్పులు తెచ్చుకుంటోంది. తప్పని సరిగా సంస్కరణలు అమలు చేస్తేనే పెండింగ్‌లో ఉన్న అప్పులు వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్ల ఏర్పాటు పూర్తి చేయాలనుకుంటున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే బిల్లులు కూడా వారే కట్టుకోవాలి. ప్రభుత్వం రీ ఎంబర్స్ చేస్తుంది. అంటే ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసి ఎంత కరెంట్ వినియోగిస్తే.. అంత డబ్బులిస్తామంటున్నారు. నెలవారీ బిల్లు మొత్తాన్ని ముందుగానే రైతు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం నుంచి అందుకున్న మొత్తాన్ని రైతు తిరిగి విద్యుత్ కంపెనీకి చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతులకు స్పష్టమవుతుంది. ఇది రైతుల్లో ఆందోళనకు కారణయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుందో అన్న ఆందోళన సహజంగానే వస్తుంది. గ్యాస్ బండకు సబ్సిడీ ఎలా నగదు బదిలీ చేస్తున్నారో ఇప్పుడు కళ్ల ముందే ఉంది. సిలిండర్ ధర రూ. వెయ్యి దాటిపోయింది. ఇచ్చే సబ్సిడీ రూ. నలభైకు పడిపోయింది. నగదు బదిలిలో ఉండే మ్యాజిక్ అది. ప్రభుత్వాలు… పథకాలకు బదులు తాము ఎందుకు నగదు బదిలీ చేయాలని కోరుకుంటాయో.. ఇదో పెద్ద ఉదాహరణ. ఈ గ్యాస్ సబ్సిడీనే… కేస్ స్టడీగా తీసుకుంటే… ఆంధ్రప్రదేశ్ రైతులు … నగదు బదిలీ అంటే భయపడుతున్నారు. పైగా ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగుల జీతాలే సరిగ్గా ఇవ్వడం లేదని.. కరెంట్ బిల్లులు ఎక్కడ ఇస్తుందని వారు సందేహంలో ఉన్నారు.ఉచిత విద్యుత్ పథకం.. ఏపీలో ఓ ట్రెండ్ సెట్టర్ లాంటిది. 2004లో వైఎస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉచిత విద్యుత్. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని.. ఆరు గంటలు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తామని.. అదే సమయంలో.. రైతుల బోర్లకు మీటర్లే బిగించబోమని హామీ ఇచ్చారు. ఇది రైతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఆయన ఘన విజయం సాధించారు. ఈ ఉచిత విద్యుత్ పథకం జోలికి తర్వాత ఏ ప్రభుత్వమూ వెళ్లలేదు. రైతుల్లో వచ్చిన ఆదరణ చూసి.. ఇంకా ఎక్కువ సమయం ఇస్తామని చెప్పడం ప్రారంభించాయి. అలాంటి ఫ్లాగ్ షిప్ పథకంలో జగన్మోహన్ రెడ్డి మార్పులు చేస్తున్నారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించారు.తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఇప్పుడు.. ఉచిత విద్యుత్ పథకాన్ని మార్చేసి.. నగదు బదిలీగా చేస్తున్నారు. విద్యుత్ సబ్సిడీలను పెద్ద ఎత్తున ఇస్తున్న ప్రభుత్వం.. వాటిని డిస్కంలకు తిరిగి చెల్లించడం లేదు. దాంతోనే సమస్య వచ్చింది. విద్యుత్ కంపెనీలకే కట్టని ప్రభుత్వాలు.. ఇక నేరుగా ఎలా రైతుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తాయన్నది ఊహించలేని విషయం. ప్రభుత్వం నగదు బదిలీ చేయకపోతే… రైతులే కట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత కామన్‌గా పెరుగుతింది. ఓ రకంగా ఈ పథకం అమలు సవాల్ లాంటిదే.