ఒంగోలు, అక్టోబరు 15,
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, అధికార పీఠం ఎక్కాలని పార్టీలన్నీ రకరకాల వ్యూహాలతో జనం ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పోటీ పడుతున్నాయి. తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారం వెలగబెడుతున్న వైసీపీ కూడా అధికారపీఠాన్ని అంటిపెట్టుకుని కూర్చోవాలని ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది. మనిషి మాంసం రుచిమరిగిన పులిలా అధికారం రుచి మరిగిన వైసీపీ కుర్చీ పట్టుకుని వేళ్లాడడం కోసం ఫీట్ల మీద ఫీట్లు చేస్తోంది.అభివృద్ధిని పట్టించుకోకుండా, సంక్షేమ పథకాల పేరుతో తమను మభ్యపెట్టిన జగన్ సర్కార్ పై ప్రజల్లో మబ్బులు వీడిపోతున్నాయంటున్నారు. ఏపీలో అభివృద్ధి నేతిబీరలో నెయ్యి చందంగా మారిందంటున్నారు. నిజానికి జగన్ పాలనపై ఏపీని ఏ సామాజికవర్గమూ సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్ ఏపీలో వస్తున్న ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతోంది? లెక్కకు మించి తెస్తున్న అప్పుల సొమ్మును ఎందుకు వినియోగిస్తోందో తెలియని అయోమయస్థితి నెలకొందంటున్నారు. జగన్ రెడ్డి సర్కార్ తెచ్చిన అప్పుల్ని తీర్చే దెలా? అనే ప్రశ్న సామాన్యులు మొదలు రాజకీయ పండితులు, మేధావుల దాకా ప్రతి ఒక్కరూ వేస్తున్నారు. ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి 3 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఏపీకి అప్పుడు 16 వేల 78 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. లోటు బడ్జెట్ తో ఏర్పాటైన నవజాత ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ పాలనా కాలం పూర్తయ్యే సరికి అప్పటి సీఎం చంద్రబాబు సర్కార్ 3 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. అయితే.. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషిచేశారు. అమరావతి రాజధాని పేరిట సరికొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.జగన్ సర్కార్ పాలన మూడేళ్లలో ఏపీ అప్పులను 7 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లింది. ఇంత భారీగా చేసిన అప్పుల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తీర్చ గలుగుతుందా? అనే సందేహాలు ఆర్థిక రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే మరో రెండేళ్లు ఏపీలో అధికారంలో ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉచిత పందేరాల నెపంతో అప్పటికి ఏపీ అప్పును దాదాపు 10 లక్షల కోట్లకు పెంచేసే అవకాశాలు లేకపోలేదనే ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తలకు మించి వైసీపీ సర్కార్ చేసిన అప్పుల భారాన్ని ‘కల్లు తాగినోడే కట్టాలి తాటిచెట్టు పన్ను’ చందంగా వైసీపీకి ఓటు వేసి గెలిపించిన జనమే భరించక తప్పదంటున్నారు.ఇంత అప్పు చేసినా.. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి ఆధారిత, ఆదాయం వచ్చే కార్యక్రమాలకు వైసీపీ సర్కార్ ఖర్చు చేయకపోవడం గమనార్హం. విద్యుత్, రవాణా చార్జీలు పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసిన దుర్మార్గానికి పాల్పడింది. ఏపీకి ఇలా ప్రజలపై వేసిన పన్నుల రూపంలో వస్తున్న ఆదాయమే తప్ప మరే ఇతర మార్గాల్లోనూ ఆదాయం లేని వైనాన్ని జనం గమనిస్తున్నారు.ఏపీలోని 66 కులాలకు 56 కార్పొరేషన్లు పెట్టి, వాటికి నిధులు ఇవ్వలేదు. దాంతో కార్పొరేషన్లు పెట్టి ప్రయోజనం ఏమిటనే సూటి ప్రశ్న ఆయా సామాజికవర్గాల నుంచి ఎదురవుతోంది. పంచాయతీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంటోంది. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్ లు స్థానికంగా పనులు చేసేందుకు భిక్షాటన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
మూడు రాజధానుల ఏర్పాటు సాకుతో ఏపీకి అసలు రాజధాని కూడా లేకుండా చేసిన జగన్ సర్కార్ పై జనం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మద్య నిషేధం పేరు చెప్పి గతంలో ఓట్లు అడిగిన జగన్ ఇప్పుడు మద్యం ధరలను పెద్ద ఎత్తున పెంచేసి సొంత బ్రాండ్లు పెట్టి జనం నుంచి లక్షల కోట్లు దోచేస్తున్న వైనాన్ని ఎక్కడికక్కడ చెప్పుకుంటున్నారు. ‘ఏపీలో ఏమున్నది గర్వకారణం ఏ రోడ్డు చూసినా గోతులు.. గతుకుల మయం’ అని ప్రజలు వైసీపీ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు.