YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హిమాచల్ సరే.. గుజరాత్ సంగతేంటీ

హిమాచల్ సరే.. గుజరాత్ సంగతేంటీ

న్యూఢిల్లీ, అక్టోబరు 15, 
హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది. సాధారణంగా అయితే, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లకి ఒకేసారి ఎన్నికలు ప్రకటించేవారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. కానీ రొటీన్‌కి భిన్నంగా కేవలం హిమాచల్‌ ప్రదేశ్‌కి మాత్రమే షెడ్యూల్‌ విడుదలైంది. గుజరాత్‌ని పక్కన పెట్టి, కేవలం హిమాచల్‌లో మాత్రమే, ఒకే విడతలో నవంబర్‌ 12న పోలింగ్‌ నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్‌ ప్రకటించారు. దీంతో ఎప్పుడూ జంటగా వచ్చే ఎన్నికలను ఈ సారి వేర్వేరుగా నిర్వహిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వైనాట్‌ గుజరాత్‌ అంటూ దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరతీస్తోంది. సరిగ్గా సీఈసీ మీడియా సమావేశంలో విలేకరులు అదే ప్రశ్న వేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలను చూశాక, గుజరాత్‌ ఎలక్షన్స్‌పై ప్రకటన చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. అందుకు బదులిస్తూ ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌ ఎక్కడా నిబంధనల్ని ఉల్లంఘించలేదంటున్నారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల మధ్య కాలవ్యవధి కనీసం 30 రోజులుంటే, తొలి అసెంబ్లీ ఎన్నికల ప్రభావం రెండోదానిపై పడదనీ, ఇక్కడ మాత్రం 40 రోజుల గ్యాప్‌ ఉందన్నారు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌లో వాతావరణం చాలా ముఖ్యమని, మంచుకురవడానికి ముందే ఓటింగ్‌ నిర్వహించాలనుకున్నామన్నారు. పైగా ఇప్పుడు పండగలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.అయితే అసలు కారణం అదికాదనీ, మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో గెలుపు కోసం ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందే మరిన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించేందుకు సిద్ధమౌతున్నారంటూ కాంగ్రెస్‌ లీడర్‌ జైరాం రమేష్‌ విమర్శిస్తున్నారు. మరోవైపు పంజాబ్‌లో తడాఖా చూపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌లో దూకుడుగా ఉన్నారు. ఆప్‌ మాత్రమే బీజేపీకి గట్టిపోటీఇవ్వనున్నట్టు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆప్‌ భయంతోనే ఈ గ్యాప్ అన్నది పలువురి బలమైన అభిప్రాయం.హిమాచల్ ప్రదేశ్‌కు నవంబరు 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.పోలింగ్‌ తేదీ, కౌంటింగ్‌కు మధ్య నెల రోజులకు పైగా వ్యవధి ఉండటంతో ఈ మధ్యలోనే గుజరాత్‌ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది.

Related Posts