ఎన్నికలకు ఏడాది ముందు రాజకీయపార్టీలు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా దానిపై పెద్ద ప్రభావమే పడే అవకాశాలు వున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు కి ఇప్పుడు ప్రతి అంశం సంకటంగానే మారింది. కర్ణాటక లో కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ కొలువు తీరుతున్న సందర్భంగా వారినుంచి వచ్చిన ఆహ్వానం టిడిపి లో పెద్ద చర్చకే దారితీసింది. కాంగ్రెస్ తో జతకట్టి ఏర్పడుతున్న ప్రభుత్వం కావడంతో ప్రమాణస్వీకారోత్సవానికి వెళితే ఎలా ఉంటుంది? వెళ్ళకపోతే ? ప్లస్ మైనస్ లపై మంత్రులతో సుదీర్ఘంగా చంద్రబాబు చర్చించాల్సి వచ్చింది. బిజెపి తో కలిసి ప్రయాణం చేసి ఎపి కి మొండి చెయ్యి దక్కడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కి ఇప్పుడు వద్దనుకున్నా కాంగ్రెస్ తో జతకట్టక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. ప్రధాని నరేంద్ర మోడీ దూకుడు కి అడ్డుకట్ట వేయాలంటే విపక్షాలన్నీ కాంగ్రెస్ తో జత కట్టకపోతే ఓట్ల చీలికతో బిజెపి లబ్ది పొందే అవకాశాలు వున్నాయి. అదీగాక దేశంలో ఎన్డీయే, యుపిఎ బలమైన సంకీర్ణ దళాలుగా కొనసాగుతున్నాయి. మూడో ఫ్రంట్ ఆశలు కుమారస్వామి కాంగ్రెస్ తో కలిశాక ఇప్పట్లో లేనట్లే. ఈ నేపథ్యంలో ఎన్డీయే ను కాదనుకున్న బాబు కాంగ్రెస్ ఉన్న యుపిఎ కు మద్దత్తు ఇవ్వక తప్పని పరిస్థితి స్పష్టం అవుతుంది. నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ చక్రం తిప్పడం, ఎన్డీయే హయాంలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో తెలుగు ముద్ర చూపారు. కాకపోతే మామా అల్లుళ్ళు ఇద్దరూ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నిర్వహిస్తూ వచ్చారు. కాంగ్రెస్ వ్యతిరేకతతో పురుడుపోసుకున్న టిడిపి తన మౌలిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ పార్టీతో జట్టు కట్టలేదు.మరోవైపు అలా చేస్తే ప్రజల్లో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర దుస్థితికి, విభజనకు కారణం అంటూ బాబు చేసిన ప్రచారం మరోసారి చర్చనీయాంశం అవుతుంది. అది పసుపు పార్టీకి జనంలో బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అంశం. ఇప్పటికే హోదాపై యూటర్న్ గోల టిడిపి కి ప్రజల్లో మైనస్ మార్కులే వేసేలా చేసింది. ఇక కాంగ్రెస్ తో జత కట్టినా లేక అంటకాగినా గతంలో ఆయన చేసిన విమర్శలు ఆరోపణలను బిజెపి, వైసిపి, జనసేన రోడ్డున పెట్టి ఉతికేస్తాయి. ఈ ధర్మసందేహాలతోనే జేడీఎస్ ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానం పై బెంగుళూర్ వెళ్లాలా? లేదా? అన్న డైలమోలో పడిపోయారు చంద్రబాబు. చివరికి అన్ని వైపులా లాభ నష్టాలు బేరీజ్ వేసుకున్నాక పసుపు దళపతి కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్ కొలువు కోలాటానికి వెళ్ళెందుకు జై కొట్టారు. దీనిపై ఎలాంటి చర్చ మొదలు అవుతుందో ఇప్పుడు చూడాలి