బీజేపీ తీవ్ర పరాభవం చవి చూసిన కర్ణాటకలో కథ ఇంతటితో ముగిసిపోలేదు. మరో 15 రోజులలోనే ఎన్నికల సంఘం నోటీసు జారీ చేస్తే.. మరో 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరగనుంది. ఈ మూడు చోట్లా కూడా అటు కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి, బీజేపీకి మధ్య నువ్వా-నేనా అనే రేంజ్‌లో పోరు సాగనుంది. అయితే, ప్రస్తుతం ఉన్న జాతకాల ప్రకారం బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఒక వేళ గెలిస్తే.. మాత్రం రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు మరింత చేరువకు వచ్చినట్టే అవుతుందనంలో సందేహం లేదు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి దెబ్బతో బీజేపీ నిలబడే అవకాశం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. బెంగళూరులోని జయనగర, ఆర్ఆర్ నగర శాసన సభ నియోజక వర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసి రెండు సీట్లు కైవసం చేసుకోవాలని నాయకులు నిర్ణయించారు. దీంతో బీజేపీని ఒంటరి చేసి రెండు ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించాలని ప్లాన్ వేశారు. జయనగర శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ చేస్తున్నారు. జయనగరలో సౌమ్య రెడ్డికి జేడీఎస్ అభ్యర్థి మద్దతు తెలపాలని నిర్ణయించారు. దీంతో సౌమ్య విజయం ఖాయమని అంటున్నారు. సౌమ్యరెడ్డి తండ్రి మాజీ హోం మంత్రి… ఆయన జయనగర పక్కనే ఉన్న బీఎం లేఅవుట్ నుంచి విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో కుమార్తె గెలుపుకోసం ఆయన వ్యూహాలు ఓ రేంజ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.కాంగ్రెస్-జేడీఎస్‌లు చేతులు కలిపిన దరిమిలా.. బీజేపీ గెలుపు సాధ్యం కాదనేది విశ్లేషకుల మాట. ఇక, విషయంలోకి వెళ్తే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజరాజేశ్వరి నగర నియోజకవర్గంలో ఓటరు గుర్తింపు కార్డులు బయట పడడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.మునిరత్నం నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొకటి.. బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ నుంచి బరిలో నిలిచిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ అనంతరం మరణించారు. దీంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. మూడోది చెన్నపట్టణ నియోజకవర్గం. ఇక్కడ జేడీఎస్ రాష్ట్ర చీఫ్ కుమారస్వామి గెలుపొందారు.కుమారస్వామి రామనగర నియోజకవర్గం సహా ఇక్కడ నుంచి పోటీ చేయడం, రెండు చోట్లా గెలుపొందడంతో ఒకదానిని వదులు కోవాల్సి వచ్చింది. దీంతో వ్యూహాత్మకంగా జేడీఎస్‌కు అంతగా కలిసి రాని రామనగరను వదులు కునేందుకు రెడీ అయ్యారు. దీనికి కూడా ఉప పోరు జరగనుంది. ఇక, ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఎవరికివారుగా నాయకులను దింపి పోటీ చేశాయి. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్-జేడీఎస్‌లు ఎలాగూ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు చోట్లా వాటి బలాబలాలను అంచనా వేసుకుని ఏదో ఒక పార్టీ మాత్రమే రంగంలోకి దిగి, మరో పార్టీ సపోర్టు తీసుకుని విజయం సాధించేలా పక్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నాయి. దీంతో బీజేపీకి ఒంటరిపోరు తప్పదు.బెంగళూరు నగరంలోనే ఉన్న మరో నియోజకవర్గం రాజరాజేశ్వరినగర (ఆర్ఆర్ నగర)లో కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న పోటీలో ఉన్నారు. జేడీఎస్ నుంచి సీహెచ్. రామచంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థి సీహచ్. రామచంద్రకు మునిరత్న మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, మూడో చోట.. రామనగరలో జేడీఎస్ సారథి, సీఎం అభ్యర్థి కుమార తన భార్య అనితను రంగంలోకి దింపనున్నారు. కుమారస్వామి రామనగరతో పాటు చెన్నపట్టణ నుంచి కూడా గెలిచారు. చెన్నపట్టణలో ఆయనకు బలమైన ప్రత్యర్థి ఉన్నారు. అక్కడ రాజీనామా చేయడం రిస్క్ అని భావించిన కుమారస్వామి తన భార్య అనిత కోసం సురక్షితమైన రామనగర వదులుకున్నారు. రామనగర జేడీఎస్‌కు కంచుకోట. ఇక్కడ జేడీఎస్ గెలుపు నల్లేరుమీద నడకే అవుతుంది. మొత్తంగా బీజేపీకి ఒక్కసీటు కూడా దక్కకుండా కాంగ్రెస్-.జేడీఎస్ లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.