తాడేపల్లి
ఎన్టీఆర్ ను చంపి.. ఆయన ఆశయాలు సాధిస్తారా..? అధికారం కోసం గోతి కాడ నక్కలా కూచుక్కూర్చున్న బాబు రియల్ విలన్. బాబు వెన్నుపోటు రక్తపు మరకను చెరిపేసే ప్రయత్నమే ఆ టాక్ షో లక్ష్యమనిమంత్రి అంబటి రాంబాబు అన్నారు.
అసెంబ్లీలో పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు టాక్ షో కి పరిమితమయ్యాడు. అప్పుడు, ఇప్పుడూ బాబుకు తానా తందానా అన్న బామ్మర్ది బాలకృష్ణ. మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకుంటున్న బాబు, పవన్ కల్యాణ్ లు మూల్యం చెల్లిస్తారు. పోగాలం దాపురించి టీడీపీ తీసుకున్న నిర్ణయాలతో మూడు ప్రాంతాల ప్రజల్లో చైతన్యం వచ్చిందని అయన అన్నారు.
ఆహా అనే టీవీ సంస్థ బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి గతంలో చాలామంది ప్రముఖులు హాజరు అయ్యారు. వాళ్లంతా కూడా ముఖ్యంగా సినిమా రంగంలో ప్రముఖులు. ఆ షో ప్రజలకు వినోదాన్ని కలగించేలా పాపులర్ అయింది. దానికి నిన్న మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పుత్ర సమేతంగా ఆ టాక్ షోలో పాల్గొన్నారు. అయితే ఆ టాక్ షో ఆద్యంతాన్ని పరిశీలించిన తర్వాత దానిలో వారు మాట్లాడిన మాటలు, వారు ప్రదర్శించిన డ్రామాలు, వారి అబద్ధాలు చూశాక.. దానిమీద స్పందించాలనిపించింది. అందుకే మీడియా ముందుకు రావడం జరిగిందని వివరణ ఇచ్చారు.
టాక్ షోను నిర్వహించేది బాలకృష్ణ. బాలయ్యకు చంద్రబాబు బావ అవుతారు, లోకేష్ అల్లుడు అవుతాడు. వీళ్లంతా కూర్చుని ఒక షో నడిపారు. దీనిలో విచిత్రమైన అంశం ఏంటంటే.. లోకేష్ అనే వ్యక్తి ఒక హాస్యనటుడిలా ఉన్నాడు. సినిమాలు, రాజకీయాలు, నిత్య జీవితంలో కూడా కొంతమంది హాస్యాన్ని పోషించేవాళ్లు ఉంటారు. అలాంటి బఫూన్ క్యారెక్టరే లోకేష్‌ది. ఇక నందమూరి బాలకృష్ణగారిని బఫూన్, జోకర్ అనలేను కానీ, అమాయకుడు, అసమర్థుడు కూడా. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉంటే ... చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ స్థాయిలో ఉన్నాడు.
- బాలకృష్ణ సమర్థుడు అయితే చంద్రబాబు తన తమ్ముడు స్థాయిలో ఉండేవాడు. అర్హతలు ఏమీ లేకపోయినా కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగా రాజకీయాలతో అందలం ఎక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడని అన్నారు..
బాబే రియల్ విలన్.. లోకేష్ ఒక బఫూన్..
ఇక బఫూన్ లోకేష్ బాబును ప్రవేశపెట్టారు. అయ్యా.. మంగళగిరిలో ఓడిపోయావు కదా? ఏమిటంటే... మళ్లీ అక్కడ నుంచే పోటీ చేసి గెలుస్తానని చెప్పగానే ఆహా.. ఓహో అంటూ అల్లుడికి మామగారు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. ఆ పక్కనే కూర్చున్న లోకేష్ నాన్నగారు, మీ బావగారు చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం పారిపోయారు కదా? దాని సంగతేంటి? అని ఎందుకు అడగలేదు బాలకృష్ణా..?. ఇలాంటి గొప్ప కామెడీ షోలు నడిపే ప్రయత్నం చేస్తున్నారని అంబటి అన్నారు.