YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిఘా నీడలో వైసీపీ ఎమ్మెల్యేలు

నిఘా నీడలో వైసీపీ ఎమ్మెల్యేలు

విజయవాడ, అక్టోబరు 17, 
వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించాలన్న పగటి కలను సాకారం చేసుకోవడానికి జగన్ నేల విడిచి సాము చేస్తున్నారా? పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల సహనాన్ని తెగేదాకా లాగుతున్నారా? వంధిమాగధుల ప్రశంసలతో ఆయనకు దేవతా వస్త్రాలు తొడిగారా? అంటే ఒకదాని తరువాత ఒకటిగా ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు మదింపునకు చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే ఔననక తప్పదంటున్నారు పరిశీలకులు.ఇప్పటికే పలు మార్లు ఆయన పార్టీ నేతల పనితీరుకు కొలమానం గడపగడపకు కార్యక్రమంలో వారి పనితీరేనని చెప్పారు. వారి పని తీరును బట్టే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఉంటుందా.. ఊడుతుందా అన్నది నిర్ణయిస్తాననీ చెప్పారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదనీ అందరినీ ఒకే గాటన కట్టేశాననీ చెప్పారు. ఇప్పుడు ఇక ఆయన మరో అడుగు ముందుకు వేసి పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెంచారు. ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా ఎమ్మెల్యేలు, మంత్రులు పని తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్న జగన్ ఇప్పుడు వారిపై నిఘా నేత్రాలను సారించారు. పీకే బృందం ఒకవైపు, ఇంటిలిజెన్స్ మరో వైపు ఎమ్మెల్యేలను అడుగడుగునా పరిశీలిస్తున్నారు. గడపగడపలో వారి పెర్ఫార్మెన్స్ పై ఎప్పటికప్పుడు జగన్ కు నవేదికలు ఇస్తున్నారు. ఇప్పటికే అది జరుగుతున్నా.. విశాఖ గర్జన వైఫల్యంతో ఈ నిఘాను మరింత పెంచారు. వచ్చే ఎన్నికలలో ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలి, ఎవరికి మంగళం పాడాలి అన్న విషయంపై ఈ నిఘా నివేదికలనే ఆయన నమ్ముకున్నారు. ప్రతి ఎమ్మెల్యే వెంటా ఒక ఐప్యాక్ ప్రతినిథిని పంపడానికి జగన్ నిర్ణయించుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ నిఘా ఎలాగూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట తిరిగే ఐ ప్యాక్ ప్రతినిథి అనుక్షణం వారి పనితీరును పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు జగన్ కు పంపుతారు. ఆ నివేదికలే సదరు ఎమ్మెల్యే, మంత్రి పని తీరుపై జగన్ ఒక అంచనాకు, తద్వారా ఒక నిర్ణయానికి రావడానికి దోహదపడుతాయి. ఐప్యాక్ ప్రతినిథులు రోజువారీ నివేదికలు, ప్రజలలో ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ, ప్రజల వద్దకు వెళుతున్నారా? ఆయన ప్రసంగాలలో ప్రభుత్వ పథకాల గురించి సమగ్రంగా వివరిస్తున్నారా? సంక్షేమ పథకాల లబ్ధిని చెబుతున్నారా? గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్నారా..ఇలా ఎమ్మెల్యే తన ఇంటి గడప దాటి గడప గడపకు వెళుతున్నారా లేదా నుంచి.. ప్రతి మాటకూ ముందూ వెనుకా జగన్ సంక్షేమ పథకాలను పొగుడుతున్నారా లేదా అన్న అంశాలపై ఉంటాయి. ఈ నివేదికలను ఏ రోజుకారోజు వైసీపీ కార్యాలయం విశ్లేషించి వారానికి ఒక సారి ఒక సమగ్ర నివేదికను జగన్ కు అందజేస్తుంది. ఇలా రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 151 నియోజకవర్గాల నుంచీ కూడా జగన్ కు నివేదికలు అందుతాయి. వాటి ఆధారంగా జగన్ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తారు. ఇప్పటికే జగన్ గడప గడపకు వర్క్ షాప్ లో కొందరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరీ వారి పని తీరు బాగాలేదనీ, మార్చుకోకుంటే చర్యలు తప్పవనీ ముఖం మీదే చెప్పేసిన సంగతి తెలిసిందే. అలా జగన్ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా వంటి వారు కూడా ఉన్నారు. ఆ వర్క్ షాపులో పేర్లు చెప్పని వారి పని తీరు బాగుందని కాదని కూడా ఆ సందర్భంలో జగన్ విస్పష్టంగా చెప్పారు. ఇలా ప్రతి క్షణం, ప్రతి రోజూ నిఘా నీడలో పని చేయాల్సి రావడం చాలా ఇబ్బంది అని వైసీపీ ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. ప్రతి క్షణం శీల పరీక్షకు నిలబడి పని చేయడం తమ వల్ల కాదని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. పార్టీ టికెట్ రాకపోతే పోయింది. ప్రతి రోజూ, ప్రతి క్షణం స్కానింగ్ కు నిలబడటం మా వల్ల కాదని కొందరు కాడి వదిలేయడాని కూడా సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. జగన్ చాలా దూరం వచ్చేశారనీ, పిల్లినైనా గదిలో తలుపులు మూసి బంధించి బెదరిస్తే తిరగబడుతుందనీ, ప్రజా ప్రతినిథుల మీద జగన్ నిఘా బూమరాంగ్ అయి మొదటికే మోసం వచ్చే పరిస్థితి తప్పదనీ రాజకీయవర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ప్రజా ప్రతినిథుల పని తీరును చెప్పాల్సింది ప్రజలే కానీ.. నిఘా బృందాలు కాదనీ, ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేల సహనాన్ని పరీక్షిస్తున్నారనీ, తెగేదాకా లాగుతున్నారనీ పరిశీలకులే కాదు, పార్టీలోని కొందరు కూడా బాహాటంగానే చెబుతున్నారు.

Related Posts