విజయవాడ, అక్టోబరు 17,
తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా ప్రకటించిన వెంటనే విజయవాడలో.. తర్వాత కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో.. తాజాగా ఇప్పుడు కొడాలి నాని అడ్డా గుడివాడ పట్టణం నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణను అడ్డగోలుగా విడగొట్టుకున్న కేసీఆర్ అంటే.. టీఆర్ఎస్ పార్టీ నేతలంటే ప్రతి ఆంధ్రుడిలోనూ ఇప్పటికింకా ఆగ్రహం తగ్గని పరిస్థితి ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా ప్రతి ఒక్కరూ ఆంధ్రులను ఇష్టం వచ్చినట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన వైనం ప్రతి ఆంధ్రుడూ గాయం మీద కారం పూసిన చందంగానే ఫీలవుతున్నారు. అయినప్పటికీ ఇలా ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పార్టీ ఫ్లెక్సీలు వరుసగా వెలుస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రజలలో విస్మయం వ్యక్తమౌతోందికేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగ్ ఏర్పాటైనప్పుడు కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట ఈ భారీ హోర్డింగ్ కనిపించింది. ‘జయహో కేసీఆర్.. నిరంతర పోరాట యోధుడు.. అనితర సాధ్యుడు.. నవ తెలంగాణ నిర్మాత.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా వారికి ఇవే మా.. శుభాకాంక్షలు’ అంటూ బండి రమేష్ పేరిట ఈ భారీ ఫ్లెక్సీ దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ తర్వాత మరి కొద్ది రోజులకు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరో ఫ్లెక్సీ వెలిసి కలకలం రేపింది. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు అమలాపురంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ‘జై బోలో.. జై కేసీఆర్.. బీఆర్ఎస్ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి రేవు బాలాజీరావు’ అంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. కైకలూరు నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ పలుచోట్ల ఫ్లెక్లీలు ఏర్పాటయ్యాయి. అల్లూరుకి చెందిన రెడ్డి సతీశ్ అరోరా పేరుతో గుడివాడ, సింగరాయపాలెం, అల్లురు సెంటర్, కోరుకొల్లు, కొత్తపాల్గొని రోడ్డు, కొండేటి రోడ్డు, భీమవరం, రోడ్డువాక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్, మంత్రి కేటీఆర్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.ఇప్పుడు కొడాలి నాని అడ్డాలో కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఏర్పాటవడం కలకలం రేపుతోంది. ‘టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్.. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ఇవే మా శుభాకాంక్షలు’ అంటూ కేటీఆర్ యూత్ పేరిట రవి స్వీట్స్ అండ్ బేకరి.. గుడివాడ పేరుతో ఈ ఫ్లెక్సీ వెలిసింది.ఏపీ ప్రజలంటే పచ్చి మిరపకాయ కొరికిన చందంగా కారాలు మిరియాలు నూరిన కేసీఆర్ అండ్ కోను ఆహ్వానిస్తూ.. శుభాకాంక్షలు చెబుతూ ఏపీలోని నలు దిశలా ఫ్లెక్సీలు ఏర్పాటు అవడం వెనుక అధికార వైసీపీ నేతల హస్తం ఉండి ఉండొచ్చనే ఊహాగానాలు సర్వత్రా వస్తున్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సందర్భంగా.. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో ఉన్న అనేక పార్టీలతో పాటు బీఆర్ఎస్ కేవలం మరో పార్టీ అవుతుందని అనడం గమనార్హం. బీఆర్ఎస్ వల్ల ఏపీలోని వైసీపీపై ఎలాంటి ప్రభావమూ పడబోదనడం విశేషం. కాగా.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించడం విశేషం. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం ఆహ్వానించదగ్గ అంశమని అన్నారు. కొత్త కొత్త పార్టీలు వస్తే రాజకీయ పార్టీల పనితీరు మరింత మెరుగవుతుందని ఆయన విశ్లేషించారు. సీనియర్ రాజకీయవేత్త, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి తాను ఓటు వేయొచ్చని చెప్పడం గమనించదగ్గ అంశం.ఆంధ్రులను అంతలా తిట్టిపోసిన కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో పలు సందర్భాల్లో చర్చ జరుగుతుండడం విశేషం. ఏపీలో ఈ మూడున్నరేళ్లలో తన విధానాలు, పరిపాలనలో అనుభవ రాహిత్యంతో తీసుకున్న అనేక అసందర్భ నిర్ణయాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిని అట్టడుగుకు నెట్టేసిన తీరు, సామాన్యుడు భరించలేనంతగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన వైనంతో ఇప్పటికే వైసీపీ అంటే జనం చీదరించుకునే స్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనం తమకు మరోసారి ఓటు వేసి గెలిపిస్తారనే ఆశలు జగన్ లో రోజు రోజుకూ సన్నగిల్లిపోతున్నాయంటున్నారు.జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం కూడా వైసీపీలోని ఎక్కువ మంది సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తోంది. ఇన్ని వ్యతిరేకతల మధ్య తనకు మరోసారి అధికారం అందని ద్రాక్ష అవుతుందేమో అనే ఆందోళన జగన్ లో పెరిగిపోతోందంటున్నారు. ఇలాంటి సమయంలో తన మిత్రుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. తన వ్యతిరేక ఓటు కొంతైనా చీలుతుందని, తద్వారా తనకు ప్రయోజనం కలుగుతుందనే యోచనలో జగన్ ఉన్నారంటున్నారు. అందుకే ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీని ఏపీలోకి ఆహ్వానిస్తున్నారంటున్నారు.