దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మొన్నటి ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిందా? లేక పరాజయం పాలైందా. ఈ నెల 15న వెల్లడైన ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఇలాంటి అనుమానాలు, సందేహాలు సగటు ఓటరుకు కలగక మానవు. వందేళ్లకు పైగా చరిత్ర గల పార్టీ ఓడిపోయిందని ఒక పక్క గణాంకాలు ఘోషిస్తున్నాయి. కానీ అదే పార్టీ దేశరాజధాని ఢిల్లీలో, రాష్ట్ర రాజధానిలో సంబరాలు చేసుకుంది. విపక్ష బీజేపీ 40 స్థానాల నుంచి తన బలాన్ని 104 స్థానాలకు పెంచుకుంది. అంటే ఏకంగా 64 స్థానాలను గతం కన్నా అదనంగా తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో లింగాయత్, దళితులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో విజయం సాధించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత స్పష్టంగా ఉండగా, కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకోవడం వింతగా ఉంది. ఎన్నికల్లో దుమ్మెత్తి పోసిన జనతాదళ్ (ఎస్)కు అడక్కుండానే మద్దతు ఇచ్చి ఉద్ధరించినట్లు వ్యవహరిస్తోంది. పైపై మెరుగులు చూసి మురిసిపోకుండా, వాస్తవాలను తెలుసుకుని వ్యవహరిస్తేనే హస్తం పార్టీ వచ్చే ఎన్నికల్లో అయినా మెరుగైన ఫలితాలు సాధించగలదు. కాదే ఇదే విజయమని అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు.12న జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 78 స్థానాలను సాధించి రెండో స్థానంలో నిలిచింది. 2013 ఎన్నికల్లో దాదాపు 120 సీట్లకు పైగా తన ఖాతాలో వేసుకుని విజయం సాధించింది. అంటే అప్పటికీ, ఇప్పటికీ దాని బలంలో దాదాపు 40 స్థానాలు కోసుకుపోయాయి. దీనిని విజయంగా ఎలా పరిగణించాలో ఎవరికీ అర్థంకాదు. విజయోత్సవాలు జరుపుకోవాల్సినంత సందర్భంగా ఎంత మాత్రం కనపడదు. ఇక స్వయంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమన్వయపరిచి, సారథ్యం వహించిన నాటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిస్థితి చూస్తే జాలి కలగక మానదు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఒక చోట ఘోరంగా ఓడిపోయారు. మరోచోట చావుతప్పి కన్ను లొట్ట బోయిన మాదిరిగా బయటపడ్డారు. అసలు రెండుచోట్ల పోటీ చేసినప్పుడే ఆయన పరాజయ సంకేతాలు వెలువడ్డాయి. గెలిచే పరిస్థితి లేక మరో చోటకు వెళ్లారు. ఒకప్పుడు నాలుగు సార్లు గెలిచిన సొంత నియోజకవర్గమైన మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి స్థానంలో 36,042 ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు. మరో స్థానమైన బాదామిలో 16వందల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. దీనిని కూడా కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తే ఎవరూ చేయగలిగింది లేదు. అంతకన్నా ఆత్మహత్యా సదృశ్యం మరొకటి ఉండదు.రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రులు 11 మంది పరాజయం పాలయ్యారు. అంటే దాదాపు సగం మంది సిద్ధరామయ్య సహచరులను ప్రజలు తిరస్కరించారు. రెవెన్యూ మంత్రి కాగోడు తిమ్మప్ప (సాగర), సీఎంకు అత్యంత సన్నిహితుడైన ప్రజాపనుల మంత్రి డాక్టర్ హెచ్.జె. మహదేవప్ప(మైసూరుజిల్లా తిరుమల కూడల నరసిపుర), స్పీకర్ కోళివాస్ (రాణిచెన్నూరు), కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ (కలఘటగి), సాంస్కృతిక శాఖ మంత్రి, సినీనటి ఉమాశ్రీ ఓడిపోయారు. ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన అటవీశాఖ మంత్రి రమానాధ్, చిన్న తరహా పరిశ్రమల మంత్రి గీతామోహన కుమారి, పశుసంవర్థక శాఖా మంత్రి ఎ.మంజు, విద్య,ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ ను ప్రజలు తిరస్కరించారు. దావణగెరె(ఉత్తర)లో మరో మంత్రి మల్లికార్జున సయితం ఓటమి పాలయ్యారు. గనులమంత్రి వినయకులకర్ణిని ధ్వార్వాడలో ప్రజలు అంగీకరించలేదు. సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి ఆంజనేయ కూడా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. మెజారిటీ మంత్రులు ఓడిపోయిన తర్వాత కూడా గెలుపు తమదేనని జబ్బలు చరచుకోవడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది.సీట్లు తగ్గినా ఓట్లు పెరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఇది కూడా పసలేని వాదన. 1,36,93,220 ఓట్లు సాధించామని ఇది 38 శాతానికి సమానమని చంకలు గుద్దుకుంటోంది. బీజేపీకి కేవలం 1,30,52,584 ఓట్లతో 36.2 శాతం సాధించిందని తమకన్నా తక్కువేనని వింతగా వాదిస్తోంది.ఎన్నికల్లో గెలుపోటములకు ఇవి ప్రామాణికాలు కావన్న విషయాన్ని కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తోంది. బీజేపీ కన్నా 6,40,636 ఓట్లు తమకు అధికంగా వచ్చాయని చెబుతోంది.దళితులను తమ దత్త పుత్రులుగా పేర్కొనే కాంగ్రెస్ కనీసం రిజర్వడ్ నియోజకవర్గాల్లోనూ ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. రాష్ట్రంలో మొత్తం 51 రిజర్వ్ డ్ నియోజకవర్గాలుండగా భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 22 స్థానాలను గెలుచుకుని అగ్రభాగాన ఉంది. హస్తం పార్టీ 20 స్థానాలకే పరిమితమైంది. జనతాదళ్ కేవలం ఏడు స్థానాలతోనే సరిపెట్టుకుంది. వాస్తవానికి ఎస్.సి, ఎస్టీ చట్టంలోని కొన్ని నిబంధనలను సరళీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దాని ప్రభావం ఓటర్లపై ఉంటుందని కమలం పార్టీ ఆందోళన చెందింది. అయినాప్పటికీ ఓటర్లు దానిని పట్టించుకున్నట్లు లేదు. ఈ పరిస్థితిని హస్తం పార్టీ ఎలా అర్థం చేసుకుంటుందో ఎవరికీ అంతు పట్టదు. ప్రత్యేక మతంగా గుర్తింపుతో లింగాయత్ ల్లో చీలిక, కన్నడ ఆత్మగౌరవం పేరుతో ప్రత్యేక జెండా రూపకల్పన, సంక్షేమ పథకాల పేరుతో భారీగా నిధుల దుర్వినియోగాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ మేరకు తీర్పు ఇచ్చారు. సామాజిక, విద్య, ఆర్థిక సర్వేల పేరుతో కులాల బలాబలాలను తెలుసుకునే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ వివరాలతో ఎన్నికలను ఎదుర్కొనే ప్రయత్నం అభాసుపాలయింది.