న్యూఢిల్లీ, అక్టోబరు 17, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో , అక్టోబర్ 17 పోలింగ్ జరుగుతుంది. 19 కౌంటింగ్. అయితే ఫలితం కోసం అంతవరకూ ఆగవలసిందేనా అంటే అవసరం లేదు. నిజమే ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత జరుగతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత శశి థరూర్ పోటీ పడుతున్నారు. ‘కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది’ అన్నట్లు నామినేషన్ వేసిన నాడే, శశి థరూర్ భవిష్యత్ ఏమిటో, తెలిసి పోయింది. ఎంత కాదన్నా, మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ సెలెక్ట్ చేసిన పార్టీ అధిష్టానం అఫీషియల్ కాండిడేట్. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కరలేదు. గాంధీలుకాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతే ఎవరు పోటీ చేసినా తటస్థంగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైనా ఎవరైనా పోటీ చేయవచ్చని సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చివరకు ఏమి జరగాలో అదే జరిగింది. నిజానికి సోనియా గాంధీ ఏరికోరి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ ను ఎంపిక చేశారు. అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. అందుకు ఆయన అంతగా సుముఖత చూపక పోయినా, ఆయన్ని ఒప్పించారు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేక గేహ్లోట్ అనూహ్యంగా ‘దమ్కీ’ ఇవ్వడంతో సోనియా గాంధీ దిగ్విజయ్ వైపు కొద్దిగా మొగ్గుచూపినా చివరకు మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ ఎనిమిది పదుల ఖర్గేను నామినేషన్ కు సిద్ధం చేశారు. ఇక శశి థరూర్ సంగతి చెప్పనే అక్కరలేదు. గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. సో, సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేదు. సో ..సో రేపు గెలిచేది ఎవరో గాంధీల ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అందుకునేది ఎవరో వేరే చెప్పనక్కరలేదు. కొంచెం ఆలస్యంగానే అయినా, శశి థరూర్ కు విషయం అర్థమైనట్లుంది. అందుకే ఆయన తీరిగ్గా అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవును మరి నాడా దొరికిందని గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుంది. నిజానికి ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అవుతారు అనేది అసలు ప్రశ్నే కాదు. ‘జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది’ అన్నట్లు అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయాసంగా అధ్యక్ష పదవిని అందుకుంటారు. అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు ప్రశ్న అది కాదు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పటిలానే అన్నదే సమాధానం. శశి థరూర్, తనకు అవకాశం ఇస్తే అధిష్టానం సంస్కృతి చేరిపేస్తానని చెప్పారు. కానీ ఖర్గే ఇతర విధేయ నాయకులు పార్టీ అధ్యక్షుడు ఎవరైనా కావచ్చుని కానీ, సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా కొనసాగుతారని చెపుతున్నారు. ఖర్గే అధ్యక్షుడిగా ఉంటారు. రాహుల్ గాంధీ నాయకుడిగా కొనసాగుతారు. అంతే కాదు 2024 ఎన్నికలలో రాహుల్ గాంధీనే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి అవుతారు. ఇది కాంగ్రెస్ విధేయ నాయకులలోనే కాదు అందరిలో ఉన్న అభిప్రాయం. ఇందుకు సంబధించి ఖర్గే కాసింత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ నిర్ణయం ఏదో పార్టీ అధిష్టానం తీసుకుంటుందని కాకుండా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ నిర్ణయం ఏదో తానే తీసుకుంటానని అన్నారు. అంతే కాదు, ‘బక్రీద్ మే బచేంగే తో.. మొహారం మే నాచేంగే’ అంటూ ఉర్దూ సామెతను ఉటంగించారు. అంటే, బక్రీద్ వేటు నుంచి బయటపడితే మొహారంలో నాట్యం చేయచ్చని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని పరిశీలకులు చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీయే ఉండాలని ఖర్గే సహా కాంగ్రెస్ నాయకత్వమంతా ఉమ్మడిగా కోరుకుంటోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాహులే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కోరుకున్నారు. అయితే అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అన్నారు.సోనియా కుటుంబం బయటవారే ఈసారి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించాలని రాహుల్ పట్టుబట్టారు. అందుకే ఖర్గే, థరూర్ బరిలో నిలిచారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పార్టీ తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే బాధ్యతలు లేని అధికారానికి అలవాటుపడిన రాహుల్ గాంధీ అందుకైనా అంగీకరిస్తారా? మోడీని ఢీ కొంటారా? అంటే అనుమానమే .. అంటున్నారు.