తిరుపతి, అక్టోబరు 18,
వైసీపీలో అంతర్గత విభేదాలు లేని నియోజకవర్గం లేదంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది.. ఆ పార్టీ నేతల్లో ఉన్న వైషమ్యలు చూస్తుంటే. తాజాగా నగరి నియోజవర్గంలో పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గు మన్నాయి. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు వ్యతిరేకంగా పార్టీలో జరుగుతున్న గ్రూపు రాజకీయాలపై రోజా ఈ సారి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఆమెకు ఆహ్వానం లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గ పరిధిలోని కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ జరిగింది. ఈ విషయంపై రోజా ఫైర్ అయ్యారు. పార్టీ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా.. ప్రత్యర్థుల దృష్టిలో పార్టీనీ, తననూ చులకన చేసే విధంగా వ్యవహరిస్తున్న వారి పట్ల పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ శాంతి హాజరయ్యారు. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొందరు తన వ్యతిరేకులు పార్టీ ముసుగులో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిండం మంత్రిగా ఉన్న తనను బలహీన పరిచే కుట్రేనని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయాలు చేయడం కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఒక ఆడియో విడుదల చేశారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విపక్షాలైన తెలుగుదేశం, జనసేనలకు పార్టీ చులకన అవుతుందని అన్నారు.పార్టీ పెద్దలు ఇప్పటికైనా ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల దృష్టి సారించి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి వారికి ప్రోత్సాహం లభించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.