కడప, అక్టోబరు 18,
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై మూడున్నరేళ్లు అవుతోంది. వైఎస్ వివేకా సామాన్యుడు కాదు.. ఆషామాషీ వ్యక్తి అసలే కాదు.. ఒక దివంగత సీఎంకు తమ్ముడు.. ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయానా సొంత బాబాయ్. అయినప్పటికీ వివేకా హత్య కేసు కొలిక్కి రాకపోవడం గమనార్హం. అయితే.. వివేకా హత్య కేసు విచారణ ముందుక సాగకపోవడానికి ముఖ్య కారణాన్ని సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఒక పిటిషన్ ద్వారా స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో నిందితులు,స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, అందువల్లే విచారణ సాఫీగా సాగడం లేదని సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే ఈ కేసులో సాక్షులకు ప్రాణ భయం ఉంటుందని సీబీఐ పేర్కొనడం గమనార్హం. వివేకా హత్య కేసులో సాక్షులను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాల్సిందే అని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. గంగిరెడ్డికి నోలీసులు జారీ చేసింది.సీబీఐ అభియోగాలపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని గంగిరెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. కాగా.. నిందితులు- స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, వారు మూకుమ్మడిగా విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఆరోపించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు దోషులెవరో తెలియకపోవడంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ క్రమంలోనే వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కూడా స్థానికంగా నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారంటూ తీవ్ర అభియోగం మోపడం గమనార్హం