రాజమండ్రి, అక్టోబరు 18,
తెలుగుదేశం పార్టీలో యువ తరంగం మరింత యాక్టివ్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీకి వైసీపీ గ్రహణం నుంచి విముక్తి కలిగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి ఆ పార్టీలోని డైనమిక్ యువ నేతలు మరింత ఉత్సాహంగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఆ క్రమంలోనే ఏపీ టీడీపీ రాజకీయాల్లో తాజాగా అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టూ అరసవిల్లి పాదయాత్రకు మద్దతుగా పాల్గొనేందుకు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ రాజమండ్రి వచ్చారు. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ రాజమండ్రిలో ఓ రహస్య ప్రాంతంలో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ ను పరిటాల శ్రీరామ్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. రాధా, శ్రీరామ్ తో పాటు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు క్రియాశీల నేత, లోక్ సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ కూడా భేటీ అయ్యారు. ఈ ముగ్గురు యువనేతల అపూర్వ కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అందులోనూ ఇరు ప్రాధాన్యతా కుటుంబాల వారసులు రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారే. వంగవీటి రాధాకృష్ణ కుటుంబానికి కోస్తాంధ్రలోను మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంతకు మించి విజయవాడలో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అలాగే.. పరిటా శ్రీరామ్ కుటుంబానికి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. తాడిత పీడిత, పేద ప్రజలకు అండగా నిలిచిన చరిత్ర ఉన్న కుటుంబాలకు వారసులు రాధా- శ్రీరామ్. పేదలకు అండగా ఉన్న క్రమంలోనే వంగవీటి రంగా, పరిటాల రవి అసువులు బాసారు. ఈ రెండు కుటుంబాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ రాజమండ్రిలో భేటి అవడం, వారితో మరో యువనేత గంటి హరీశ్ కూడా జత కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి అపూర్వ సమావేశం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ముగ్గురూ కూడా మూడు వేర్వేరు బలమైన సామాజికవర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. వంగవీటి రాధాపై రెక్కీ ఘటన సందర్భంగా పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. వంగవీటి రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని, రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ సందర్భంగా శ్రీరామ్ హెచ్చరించారు. వంగవీటి కుటుంబం అంటే మామూలు కుటుంబం అనుకుంటున్నారా? అని శ్రీరామ్ ఘాటుగా ప్రశ్నించారు. అప్పటికి ఈ యువనేతలిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇరువురూ టీడీపీలో డైనమిక్ లీడర్లే. అలాంటి యువ నేతలు ఇప్పుడు తొలిసారిగా రాజమండ్రిలో సమావేశమై ఏ విషయాలు చర్చించారనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ అక్కసుతోనే అధికార వైసీపీ వీరిరువురినీ ఇబ్బందులు పెట్టేందుకు యత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగింది. రాధాపై రెక్కీ నిర్వహించడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. రాధాను నిర్మూలించాలనే కుట్ర ఈ రెక్కీ వెనుక ఉన్నట్లు తర్వాత బయటపడింది.వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీపై సోషల్ మీడియాలో పలువురు విశేషంగా స్పందిస్తున్నారు. ఇద్దరు పులి బిడ్డలు కలిశారంటే చరిత్ర తిరగరాసినట్లే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పరిటాల రవి, వంగవీటి రంగా ఇద్దరూ సింహాలని, ఆ సింహాల కొడుకులు రాధా, శ్రీరామ్ తొలిసారి భేటీ అవడాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్- గంటి హరీశ్ భేటీ అవడం కూడా టీడీపీలో యువతలో మరింత చైతన్యం తీసుకొచ్చే వ్యూహాల గురించి వీరు చర్చించి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వీరి మధ్య ఏవో కీలకమైన అంశాల మీదే ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగి ఉండొచ్చాని భావిస్తున్నారు. మొత్తానికి రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడమే ఆశ్చర్యకరమైతే.. వారితో బాలయోగి కుమారుడు హరీశ్ జత కలవడం అపురూపమైన, అరుదైన ఘటనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా వీరి కలయిక సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురు యువనేతల కలయిక ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యంగా పెచ్చుమీరిన నియంతృత్వ వైఖరితో ఉన్న వైసీపీ నేతల్లో కలవరం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.