నెల్లూరు, అక్టోబరు 18,
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో టీడీపీ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. తాజాగా టీడీపీ నేతలంతా కలసి ఆయన నివాసానికి వెళ్లి మరీ పరామర్శించారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు నివాళి అర్పించేందుకు మాగుంట నివాసానికి చేరుకున్న టీడీపీ నేతలు, ఆయన్ను పరామర్శించారు. వైసీపీ నేతలు కూడా ఇంత ఆప్యాయంగా ఆయన నివాసానికి రాలేదు. ఆమధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పరామర్శకు వచ్చారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్.. అందరూ కలసి మాగుంట నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చారు.ఇటీవల మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ అధిష్టానం తీరుతో కాస్త అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇల్లు, ఆఫీస్‌లపై కూడా సోదాలు జరిగాయి. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎవరూ సానుకూలంగా మాట్లాడలేదు. అటు మాగుంట కూడా వచ్చేసారి ఎన్నికల్లో తన తరపున తన కొడుకు పోటీ చేస్తారని ప్రకటించారు. దానిపై కూడా వైసీపీ నుంచి స్పందన లేదు.మాగుంట కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంచి పలుకుబడి ఉంది. నెల్లూరు, ఒంగోలు నుంచి కూడా వారు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా ఉన్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేనితో మాగుంటకు మరీ అంత సఖ్యత లేదనే ప్రచారం కూడా ఉంది. ఈ దశలో మాగుంట అసలు వైసీపీలో కొనసాగుతారా.. ? లేక టీడీపీవైపు చూస్తారా.. ? అనేది తేలాల్సి ఉంది.మాగుంట ఫ్యామిలీ ప్రధానంగా వ్యాపారాలపై డిపెండ్ అయి ఉంది. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. అన్నిపార్టీలు కవర్ చేశారు. స్థానిక రాజకీయాలని మాగుంట ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోదు. విమర్శలు, ప్రతివిమర్శలకు కూడా వారు పూర్తిగా దూరం. వ్యాపారాలపై ఆధారపడ్డారు కాబట్టి, వారికి అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా ముఖ్యమే. అలా ఆయన టీడీపీకి కూడా సమదూరం పాటిస్తున్నారు.ప్రస్తుతం టీడీపీ నేతలు మూకుమ్మడిగా కలసి మాగుంట ఇంటికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతానికి ఇది పరామర్శ మాత్రమేనంటున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు. అంతకు మించి ప్రత్యేకంగా ఇతర అంశాలేవీ వారి మధ్య చర్చకు రాలేదని చెబుతున్నారు.నెల్లూరు రాజకీయాలను అంచనా వేయడం కష్టం. నెల్లూరులో స్వపక్షంలోనే విపక్షంలా చాలామంది కొట్లాడుకుంటున్నారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ గెలిచినా కూడా చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేల మధ్యే సఖ్యత లేదని చెబుతుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు మాగుంట శ్రీనివాసులరెడ్డితో టీడీపీ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఎవరూ పెద్దగా స్పందించకపోయినా, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి మాత్రం ప్రజల్లో ఉంది.