YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త బంధాలు కలుస్తాయా... పవన్ కు బాసటగా పార్టీలు

కొత్త బంధాలు కలుస్తాయా... పవన్ కు బాసటగా పార్టీలు

విజయవాడ, అక్టోబరు 18, 
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్లారనే కానీ హోటల్ గది నుంచి బయటకు రాలేకపోయారు. ఓ దశలో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ పోలీసులు అక్కడి వరకూ వెళ్లలేదు. అయితే ఎంత త్వరగా ఆయనను విశాఖ నుంచి పంపించేద్దామా అని ఆలోచన మాత్రం చేస్తున్నారు.  ఎప్పుడైనా ఆయనను విశాఖ నుంచి పంపించేయవచ్చు. అయితే ఆయన విశాఖ పర్యటన ఫెయిలయిందని అనుకోవడానికి మాత్రం అవకాశం లేకుండా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నీ సాఫీగా సాగి ఉంటే పవన్ ఇతర చోట్ల తీసుకున్నట్లే జనవాణిలో ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుని ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఎంతో ముందడుగు పడింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యే ఓ వాతావరణాన్ని ఏర్పాటు చేసింది.  పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పూర్తి స్థాయిలో జనసేన కార్యక్రమం. పవన్ విశాఖలో అడుగు పెట్టక ముందే విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై బీజేపీ ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. జనసైనికులు దాడి చేశారని పోలీసులు కూడా చెప్పలేదని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ముందుగానే స్పందించారు.  అసలు శాంతిభద్రతలు లేవని ప్రభుత్వం చెప్పదల్చుకుందా అని పవన్‌కు మద్దతుగా నిలిచారు .  ఆదివారం రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా విజయవాడలో పదాధికారుల సమావేశంలో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి సంఘిభావం తెలిపారు. ప్రభుత్వం తీరుపై కలిసి పోరాడదామని హామీ ఇచ్చారు.  తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఫోన్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇరువురూ పలు అంశాలపై చర్చించారు. వేర్వేరుగా చర్చలు జరిపినా పవన్‌కు అటు బీజేపీ.. ఇటు టీడీపీ రెండూ అండగా నిలిచాయి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కొంత కాలంగా విపక్షాల ఐక్యతపై చర్చ జరుగుతోంది. 2014లో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడుతుందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. అయితే ఆ దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగులు పడలేదు. బీజేపీ సంగతి పక్కన పెడితే.. ఓట్లు చీలనివ్వబోమంటూ పవన్ కల్యాణ్ అదేపనిగా ప్రకటనలు చేసినప్పుడు.. ఆయన టీడీపీతో పొత్తుకు రెడీ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ తర్వాత రెండు వైపులా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు నేరుగా పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు మాట్లాడటంతో  పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు వారేమీ మాట్లాడుకోకపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా కలసి పని చేస్తే వచ్చే లాభాలపై వారిద్దరూ స్పష్టమైన అవగాహన ఉంటుంది కాబట్టి ముందు ముందు ఈ మాటలు మరింత బలమైన రాజకీయ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడనికి ఉపయోగపడతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ విశాఖ వచ్చి.. తన జనవాణి కార్యక్రమం నిర్వహించుకుని.. నియోజకవర్గ సమీక్షలు చేసుకుని వెళ్లిపోయి ఉంటే ఎలాంటి రాజకీయం జరిగేది కాదు.  ఎవరి రాజకీయం వారు చేసుకునేవారు. కానీ  ప్రభుత్వం, పోలీసులు పవన్ పర్యటనను అడ్డుకోవడం  విపక్షాల మధ్య మాటలు కలవడానికి కారణం అయింది. దీనికి పరోక్షంగా వైఎస్ఆర్‌సీపీనే కారణం. విపక్షాలు కలిసి పోటీ చేస్తే..  అధికార పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందే.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే ఎంత పెద్ద ముప్పు ఏర్పడుతుందో రాజకీయాల్లో ఉన్న వారికి సులువుగా తెలుసు. అందుకే పవన్ కల్యాణ్‌ను ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పుడు  వైఎస్ఆర్‌సీపీ ఓటమే లక్ష్యంగా ప్రకటించుకున్న పవన్ కల్యాణ్‌కు.. చంద్రబాబు ఫోన్ చేశారు.  అంటే రాజకీయంగా కదలిక వచ్చినట్లే. బీజేపీ కూడా ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ విషయంలో ఎలాంటి విమర్శలు చేయడం లేదు. పూర్తిగా వైఎస్ఆర్‌సీపీనే టార్గెట్ చేసుకుంటోంది. బీజేపీ హైకమాండ్ కూడా.. తెలంగాణ రాజకీయాల్లోనూ టీడీపీ సహకారం తీసుకోవాలనుకుంటున్నారు. ఎలా చూసినా.. పాత అలయెన్స్ కోసం మార్గాలు ఇప్పుడే తెరుచుకున్నాయి. దానికి వైఎస్ఆర్‌సీపీనే పరోక్ష కారణంగా నిలిచింది.

Related Posts