YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లాభాలు పండిస్తున్న సీతాఫలాలు

లాభాలు పండిస్తున్న సీతాఫలాలు

ఏలూరు, అక్టోబరు 19, 
మండలంలోని ఊనగట్ల, అమ్ముగుంట, చిక్కాల, చిక్కాలపాలెం గ్రామాలు సీతా ఫలాలకు ప్రసిద్ధి. మెట్ట ప్రాంత గ్రామాల్లోని గరువు భూముల్లో రైతులు ఈ తోటలను విస్తారంగా పెంచుతారు. ఏటా అక్టోబర్‌లో కాపునకు కొచ్చే సీతాఫలాలను మండలంలోని అమ్ముగుంట, చిక్కాల కేంద్రాలుగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. మండలంలో పండే సీతాఫలాలు రుచిగా ఉంటాయి. అందుకే డిమాండ్‌ కూడా ఎక్కువ. వీటిని కొనుగోలు చేయడానికి భీమవరం, తణుకు, విజయవాడ, ఏలూరు సహా పరిసర పట్టణ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఈ సీజన్‌లో రోజూ ఊనగట్ల, చిక్కాల వస్తారు. రైతులు తమ పొలాల్లో కాసిన సీతాఫలాలను మార్కెట్‌లకు తీసుకొచ్చి వారికి విక్రయిస్తారు.పెద్ద వ్యాపారులు రోజు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మేర లావాదేవీలు జరుపుతారు. ఇక చిల్లర వ్యాపారులు కూడా ఈ రెండు చోట్లా సీతాఫలాలను కొనుగోలు చేసి కొవ్వూరు, నిడదవోలు పరిసర గ్రామాల్లో విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తారు.  వర్షాల వల్ల ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వాతావరణ పరిస్థితులు కారణంగా కాయలన్నీ దాదాపు ఒకేసారి పక్వానికి రావడంతో వాటిని ఒబ్బిడి చేసుకోలేక  రైతులు ఇబ్బందులు పడ్డారు. కొంత మేర కాయలు వర్షానికి దెబ్బతిన్నాయని పలువురు రైతులు తెలిపారు. అయితే ఏటా ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వంద సీతాఫలాలను రైతుల వద్ద నుంచి రూ.2,000 నుంచి రూ.2,500 రేటుకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రిటైల్‌గా రూ.3,000 నుంచి రూ.4,000 రేటుకు అవకాశాన్ని బట్టి, కాయల సైజును బట్టి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది సీతాఫలాల ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాగల్లు మండలంలోని సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సీతాఫలాల తోటలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రైతులు తమ పొలాల్లో పండిన కాయలను కోసి సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన కాయలను మినీ వ్యాన్‌లపై పట్టణాలకు తరలించి అక్కడ  అమ్ముకుంటారు.  

Related Posts