YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ బ్యాలెన్స్ తప్పారా...

పవన్ బ్యాలెన్స్ తప్పారా...

విజయవాడ, అక్టోబరు 19, 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎన్నడూ లేని ఆగ్రహం కనిపించింది. వైసీపీ ట్రాప్ లో పడిపోయినట్లే అనిపిస్తుంది. రెచ్చిపోయి ఇష్టమొచ్చినట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. ఆయన పార్టీలో నేత కాదు. ఒక పార్టీకి అధినేత. ఒక పార్టీని నడపాల్సిన లీడర్. ఆయనను అనుసరించే క్యాడర్ పనిచేస్తుంది. అలాంటి పవన్ కల్యాణ్ బ్యాలన్స్ తప్పి పోయారనిపిస్తుంది. అసభ్యకరమైన పదాలు ఆయన నోటి నుంచి వెలువడటంతో పార్టీనేతలే విస్తుపోవాల్సి వచ్చింది వైసీపీ నేతలు రెచ్చగొట్టొచ్చు. వ్యక్తిగత దూషణలకు దిగొచ్చు. ఆ విమర్శలకు పార్టీ నేతల చేత సమాధానం చెప్పొచ్చు. వైసీపీ నేతలు వ్యక్తిగతంగా తిట్టినంత మాత్రాన ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గుముఖం పట్టదు. కానీ పార్టీ అధినేత బ్యాలన్స్ తప్పి నోరు జారితే తర్వాత సమాధానం చెప్పుకునే వారు పార్టీలోనే ఉండరు. అనంతరం చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నా ఫలితం ఉండదు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వొచ్చు. వారి రెచ్చగొట్టే చర్యలను ఖండించొచ్చు. కానీ ఒక పార్టీ అధినేతగా సంయమనం పాటించాలి. మౌనంగా ఉంటే కొంత సానుభూతి వస్తుంది. అవతలి వాళ్లు రెచ్చిపోయారని, రెచ్చిపోతే ఎవరికి నష్టం అని పార్టీ లోనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చల్లోనూ పాల్గొనాలని, ఏదైనా అతిగా మాట్లాడితే వెంటనే చెప్పుతీసుకుని కొట్టాలని క్యాడర్ ను రెచ్చగొడితే ఏం ప్రయోజనం ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పవన్ ప్రసంగాన్ని చూస్తే తన సహనాన్ని కోల్పోయారని పిస్తుంది. . ఒక పార్టీని నడిపించాల్సిన లీడర్. వచ్చే ఎన్నికలలో పోటీ చేసి నెగ్గి అసెంబ్లీకి రావాల్సిన నేత. అలాంటి నేత నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం దురదృష్టకరం. పార్టీ అధినేతలంటే సంయమనం ఉండాలి. అది వైసీపీ అధినేత జగన్ కావచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు. కానీ మాట నోరు జారితే అది పార్టీని ప్రజల్లో పలుచన చేస్తుంది. ఈ విషయం పార్టీ నేతలలోనూ చర్చనీయాంశమైంది. రాజకీయంగా కూడా పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
లాస్ట్ పంచ్ చంద్రబాబుదే
రాజకీయాల్లో కొన్నిసార్లు వెనక్కు తగ్గొచ్చు. వెనకడుగు వేయవచ్చు. అది ఓటమిగా భావించడం సరికాదు. అల్పుడని, భయపడిపోతున్నాడని ఎవరైనా అనుకోవచ్చు. అంతిమంగా లక్ష్యం అధికారమే. అందులో చంద్రబాబు లాంటి నేతలకు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసు. సినిమాలో అదే డైలాగు చెప్పిన పవన్ కల్యాణ్ కు అది తెలియకపోవచ్చు. కానీ చంద్రబాబుకు మాత్రం తెలుసు. రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబుకు మించిన వారు లేరు. ఆయనను మించిన వ్యూహకర్త లేరు.. 23 స్థానాలకే పరిమితం కావచ్చు. వచ్చే ఎన్నికలలో గెలవలేమన్న ప్రచారాన్ని ముమ్మరంగా ప్రత్యర్థులు చేయొచ్చు. ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ చంద్రబాబు గెలవలేరని ఎగతాళి చేయొచ్చు. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోరు. తనకు అంతిమ లక్ష్యం అధికారమే. మళ్లీ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. అందుకు ఆయన ఎంతవరకైనా వెనకడగు వేస్తారు. చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో పాఠాలు నేర్పాయి. వాటి వల్ల కావచ్చు.. లేదంటే స్వయంగా అబ్బిన విద్య కావచ్చు. బాబును మించిన స్ట్రాటజీ మరొకరికి లేదన్నది కూడా ప్రత్యర్థులు కూడా అంగీకరించే అంశం. ఈరోజు జరిగింది కూడా అంతే. పవన్ ను కలిసేందుకు చంద్రబాబుకు ఎటువంటి అహం అడ్డురాలేదు. మెట్టు దిగిరావడానికి ఆయన సంకోచించలేదు. స్వయంగా కలిసేందుకు ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. ఐదేళ్ల తర్వాత కలిశారు. అందుకు తగిన సమయం కలిసొచ్చింది. విశాఖలో జరిగిందేందో ఎవరికీ తెలియదు కాని దానిని చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారు. విశాఖలో జరిగిన సంఘటనను చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకున్నారు. బీజేపీని కూడా తన దారికి తెచ్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించి ఉండవచ్చు. . చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు వేయడంలో దిట్ట. పవన్ కల్యాణ్ తనకు అనుకూలమనే భావన ప్రజల్లోకి చంద్రబాబు పంపగలిగారు. తనతో పొత్తు పెట్టుకోవాల్సిందేనన్న సంఘటన జరిగేంత వరకూ చంద్రబాబు వెయిట్ చేశారు. సరే.. రేపటి ఎన్నికల్లో ఎవరు కలిసినా? ఎవరు విడిగా పోటీ చేసినా? ఫలితం మనం ఇప్పుడే చెప్పలేము కాని, ప్రస్తుతం మాత్రం చంద్రబాబు పై చేయి సాధించినట్లే. చంద్రబాబు గేమ్ మొదలు పెట్టారనుకోవచ్చు. బీజేపీ కలసి రాకపోయినా జనసేన, కమ్యునిస్టులతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రేపు పొత్తుల విషయంలో ఎలాంటి తేడాలొచ్చినా అలయన్స్ తప్పనిసరి అని జనసేనను ట్రాప్ లోకి చంద్రబాబు లాగారనే చెప్పవచ్చు. బలవంతంగానైనా ఇక పవన్ కు చంద్రబాబుతో చేతులు కలపక తప్పదు.

Related Posts