YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పార్కింగ్ ఎక్కడ..?

 పార్కింగ్ ఎక్కడ..?

ఆదాయ ఆర్జనపై ఉన్న శ్రద్ధ వసతుల కల్పనపై లేకపోతోంది. విజయవాడ నగరంలోని వ్యాపారుల అత్యాశ కారణంగా కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం ప్రజలపై కూడా పడుతోంది. రద్దీ ప్రాంతాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ దుకాణాలకు వచ్చే కొనుగోలుదారుల సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారు. వాహనాలపై వచ్చే వారు వాటిని ఎక్కడ ఉంచాలో అర్థం కాని పరిస్థితి. కనీసం పార్కింగ్‌కు కూడా అవకాశం లేకుండా నిర్మిస్తున్నారు. దీంతో  చేసేది లేక రోడ్లపైనే వాహనాలను ఉంచాల్సి వస్తోంది. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఇరుకు రోడ్లపై నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. రద్దీ సమయాలలో అయితే నరకం  కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా పార్కింగ్‌ ప్రాంతం ఉండాలి. దీన్ని ప్లాన్‌లో చూపిస్తున్నా తర్వాత.. ఉల్లంఘిస్తున్నారు. చాలా చోట్ల సెల్లార్లను కూడా దుకాణాలకు అద్దెకు ఇస్తున్నారు. రాజధానిగా మారిన తర్వాత విజయవాడలో రద్దీ బాగా పెరిగింది. అసలే చిన్న రోడ్లు.. దీనికి తోడు రహదారిపైనే పార్కింగ్‌ చేస్తుండడం వల్ల తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. వన్‌టౌన్‌, బీసెంట్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో నిత్యం ఇదే పరిస్థితి. పరిస్థితులను చక్కదిద్దాల్సిన నగరపాలిక అధికారులు పట్టించుకోవడం లేదు. వీఎంసీ, ట్రాఫిక్‌ పోలీసుల మధ్య సమన్వయం కొరవడడంతో అవస్థలు తప్పడం లేదు.

దక్షిణ కోస్తాలోనే బెజవాడ ప్రధాన వాణిజ్య నగరంగా అభివృద్ధి చెందింది. గత మూడేళ్ల నుంచి నవ్యాంధ్రకు రాజధానిగా మారడంతో పాలన ఇక్కడే కేంద్రీకృతమైంది. రాజకీయ కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే సాగుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి రాకపోకలు పెరిగాయి. దుస్తులు, విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్‌, గృహావసర, తదితర వస్తువుల కోసం రోజూ భారీ సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ నుంచి పలు అవసరాల కోసం బెజవాడకు నిత్యం వస్తుంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు తోడు, ఈ జిల్లాల నుంచి సుమారు 2.45 లక్షల మంది రోజూ నగరానికి వస్తుంటారు. వీరిలో 90 శాతం పైగా వివిధ వస్తువుల షాపింగ్‌ చేస్తున్నారు. నగర జనాభా కూడా అనూహ్యంగా పెరిగి 15 లక్షలు దాటింది. దీంతో సమస్య తీవ్రరూపం దాల్చింది.

నిత్యం కిక్కిరిసిపోయే బీసెంట్‌ రోడ్డులో దుస్తుల దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నవరంగ్‌ టాకీసు రోడ్డులో ఆటోమొబైల్‌ షాపులు నడుస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి వీధిలో బంగారు దుకాణాలు, ఆ పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌, దాని చుట్టపక్కల ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలు ఏర్పాటయ్యాయి. పాత బస్టాండు ఎదురు రోడ్డులో ప్లైవుడ్‌, శానిటరీవేర్‌ దుకాణాలు వచ్చాయి. ఏలూరు రోడ్డులో అప్సర థియేటర్‌ వరకు ఫర్నీచర్‌ షాపులు, అక్కడి నుంచి రామమందిరం వరకు సైకిల్‌, పుస్తకాల దుకాణాలు, మొబైల్‌ షాపలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌పేటలో ఆసుపత్రులు ఒకే చోట కేంద్రీకృతమయ్యాయి. వన్‌టౌన్‌లో అయితే కాలు తీసి కాలు పెట్టలేనంతగా రోడ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. శివాలయం వీధి, రామగోపాల్‌ వారి వీధి, వాసవీ మార్కెట్‌, గుడివాడ వారి వీధి, సామారంగం చౌక్‌, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రికల్‌, ఫ్యాన్సీ దుకాణాలు ఏర్పడ్డాయి. వీటిల్లో కొనుగోళ్లకు చాలా జిల్లాల నుంచి భారీగా ప్రజలు వస్తుంటారు.

వన్‌టౌన్‌, బీసెంట్‌ రోడ్లు విజయవాడ నగరంలో ఎప్పటి నుంచో కీలకమైన వాణిజ్య ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. అప్పట్లో నిర్మించిన కాంప్లెక్స్‌లకు పార్కింగ్‌ వసతులు కూడా లేవు. దీనికి తోడు ఆ రోడ్లన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి. మున్సిపల్‌ కాంప్లెక్స్ మినహా చాలా వాటికి అసలు వాహనాలు నిలిపేందుకు కూడా జాగా లేదు. ఏలూరు రోడ్డు, బందరు రోడ్లలో ఆ తర్వాత వచ్చిన దుకాణాలదీ ఇదే పరిస్థితి. నగరంలో మొత్తం 44 వేల సముదాయాలు ఉన్నాయి. ఎక్కడా నిబంధనలు పాటించిన పాపాన పోలేదు. సంబంధిత వాణిజ్య సముదాయం నిర్మాణం కోసం నగరపాలికకు ఇచ్చే ప్రణాళికలో విధిగా పార్కింగ్‌ ప్రదేశాన్ని కూడా చూపించాల్సి ఉంది. ఇది ఉంటేనే అనుమతి వస్తుంది. ప్లాన్‌లో చూపిస్తున్నా ఆనక దాన్ని తమకు అనుగుణంగా మార్చేస్తున్నారు. మంచి డిమాండ్‌ గల ప్రాంతాల్లో అయితే చిన్నపాటి దుకాణాలుగా మారుస్తున్నారు. ఫలితంగా వాహనాలపై వచ్చే కొనుగోలుదారులు రోడ్డుపై నిలపడం తప్ప వేరే మార్గం ఉండడం లేదు.

పశువుల ఆసుపత్రి కూడలి నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల సముదాయాలు వచ్చాయి. చెన్నై - కోల్‌కతా జాతీయరహదారి సర్వీసు రోడ్డులోనూ ఇదే పరిస్థితి. బెంజ్‌ సర్కిల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు రెండు వైపులా ఉన్న సర్వీస్‌ రోడ్లపై ఈ మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు వచ్చాయి. చాలా వరకు పార్కింగ్‌ లేకుండానే నిర్మించారు. రోడ్డుపై వెళ్లే వారికి ఇబ్బందిగా మారుతోంది. ఆసుపత్రుల నిర్మాణంలోనూ నిబంధనల ఉల్లంఘనలు షరా మామూలుగా మారాయి. బందరు రోడ్డులోని ఓ ఆసుపత్రిలో సెల్లార్‌ పార్కింగ్‌లో జనరేటర్‌ గది, వివిధ పరీక్షల కోసం గదులు నిర్మించారు. సూర్యారావుపేట, డోర్నకల్‌ రోడ్లపై ఉన్న పలు హాస్పిటల్స్‌కు వచ్చే రోగులు తమ బండ్లను నిలిపేందుకు కూడా అవకాశాలు లేవు. ఇబ్బందుల దృష్ట్యా ఎంజీ రోడ్డులోని మాల్స్‌ ఎదుట ట్రాఫిక్‌ పోలీసులు ‘నో పార్కింగ్‌’ బోర్డులు పెట్టారు. ఇవి కూడా నామ్‌కేవాస్తేగా మారాయి. పార్కింగ్‌కు అవకాశం లేక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది.

Related Posts