వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
కుమార్తె సునీత డిమాండ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
న్యూ డిల్లీ అక్టోబర్ 19
హత్యకు గురైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ లేదా కర్ణాటకకు మార్చాలన్న ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత డిమాండ్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తమకు ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. పోలీసులు సాక్షులను సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని.. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అక్టోబర్ 19న సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాగా వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులైన ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డిలను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.కాగా తెలంగాణకు మాత్రం బదిలీ చేయవద్దని సీబీఐ ధర్మాసనాన్ని కోరింది. కర్నాటకకు బదిలీ చేయాలని కోర్టును సీబీఐ అభ్యర్థించింది. అయితే తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరిన సునీతా రెడ్డి తరఫు న్యాయవాదులు మాత్రం.. తెలంగాణకు బదిలీ చేసినా తమకు అంగీకారమనేని సుప్రీంకోర్టుకు తెలిపారు.కాగ వైఎస్ వివేకా హత్య కేసు విచారణలొ జాప్యం జరుగుతుండటంపై సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీతారెడ్డి పిటిషన్లో చేసిన వాదనలను న్యాయస్థానం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని సునీత తన పిటిషన్లో పేర్కొన్నది పూర్తిగా వాస్తవమని సీబీఐ న్యాయవాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో నిందితులతో రాష్ట్ర పోలీసులు కుమ్మక్కయ్యారని వారిపై ప్రైవేట్ కేసులు పెట్టి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారని అఫిడవిట్లో సీబీఐ ఆరోపించింది. తనపై తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సీబీఐపై కేసు వేసిన ఓ పోలీసు అధికారికి పదోన్నతి కల్పించినట్లు సీబీఐ న్యాయవాది తెలిపారు.నిందితులను రాష్ట్ర పోలీసులు తమకు వీలైనంత వరకు కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది.