తిరుపతి, అక్టోబరు 20,
రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్దిసేపటికే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.. అంతకుముందు బీజేపీతో పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.. జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగమేంటని విమర్శలు వచ్చాయని గుర్తుచేసుకున్న పవన్.. ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నా.. పూర్తిస్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.. ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలుసని.. ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం అంటే నాకు గౌరవమే.. అలాగని ఊడిగం చేయలేనంటూ కుండ బద్దలు కొట్టేశారు పవన్.. ఈ వ్యాఖ్యల తర్వాత.. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు చంద్రబాబు రావడం ఆసక్తికరంగా మారింది.జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, జనసేన శ్రేణులు.. మంత్రుల కార్లపై దాడి చేశారనే ఆరోపణలతో.. జనసేన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడం.. హోటల్‌కే పవన్ పరిమితం కావడం.. విశాఖ నుంచి తిరుగు ప్రయాణంలో ఆంక్షల మధ్య పవన్ కల్యాణ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం లాంటి పరిణామాలపై గుర్రుగా ఉన్నారు జనసేనాని.. విజయవాడ చేరుకున్న తర్వాత వైసీపీపై దుమ్మెత్తిపోశారు.. ఇక, ఇవాళ జరిగిన కార్యక్రమంలో.. వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. తనను ప్యాకేజీ స్టార్ అని పిలిస్తే.. చెప్పుతో కొడతానంటూ చెప్పుతీసి మరీ చూపించారు పవన్.. అంతేకాదు.. తన సంపాదన, పన్నుల వివరాలు కూడా వెల్లడించారు.. ఇదంతా అధికార పక్షంపై ఎదురుదాడిగా భావించినా.. బీజేపీతో పొత్తు విషయంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు తెరలేపాయి.. ఇదే సమయంలో.. విజయవాడలో పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్‌కు వచ్చిన చంద్రబాబు.. ఆయనతో భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీభావం తెలిపేందుకే వచ్చారని చెబుతున్నా.. ఈ భేటీకి రాజకీయం వ్యూహం కూడా ఉందనే చర్చ సాగుతోంది. జనసేనాని, టీడీపీ అధినేత భేటీలో.. మెగా బ్రదర్ నాగబాబు, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.మరోవైపు.. బీజేపీ పొత్తుపై పవన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శిబిరం నుంచి కూడా కౌంటర్ ఇచ్చింది.. ఇంత కాలం ముసుగులో ఉన్నారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ అసలు రంగు బయటపడిందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్నినాని.. అంటే.. పవన్ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికే ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు. అయితే, గతంలో.. కలిపి పనిచేసిన విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మంచిదనే భావనలో పవన్ ఉన్నారనే ప్రచారం సాగుతున్నా.. బీజేపీ ఈ విషయంలో కలిసిరాకపోవడంతో.. బీజేపీతో నడిస్తే.. వైసీపీని ఢీకొట్టడం కష్టమని.. తెలుగుదేశం పార్టీతో జతకడితే.. జగన్ కోటను బద్ధలు కొట్టవచ్చుఅనే ప్లాన్‌లో పవన్ కల్యాణ్ ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నమాట.. మరి, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి..