ఒంగోలు, అక్టోబరు 20,
విత్తు నుంచి విక్రయం వరకు, పురుగుమందుల నుంచి యంత్ర పరికరాల వరకు రైతులకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఎన్నో సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు అడుగడుగునా తోడుగా నిలవాలన్న సంకల్పంతో ప్రభుత్వం గ్రామానికో ఆర్బీకే చొప్పున రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలోని డిజిటల్ కియోస్క్‌ల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను బుక్ చేసుకున్న గంటల్లోనే రైతుల ముంగిటకు చేరుస్తున్నారు.ధాన్యంతో సహా పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీకేలు.. నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్), వరల్డ్ బ్యాంక్, ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు అందుకున్నాయి. వివిధ దేశాలు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలు సైతం ఆర్బీకేలను సందర్శించి వాటి సేవలను ప్రశంసిస్తున్నాయి.తమ రాష్ట్రాలు, దేశాల్లోనూ ఆర్బీకేలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్బీకేల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల (పీఎంకేఎస్‌కే)ను తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో రైతు సమస్యలన్నింటికీ ఒకే పరిష్కార కేంద్రంగా వీటిని తీర్చిదిద్దనుంది. తొలి దశలో అక్టోబర్ 17న 864 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఏపీలో 32 కేంద్రాలను ప్రారంభించారు. ఇటీవలే ప్రారంభించిన వన్ నేషన్–వన్ ఫెర్టిలైజర్ కింద భారత్ బ్రాండ్ పేరిట కంపెనీల రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ స్ఫూర్తితో నీతి ఆయోగ్, కేంద్ర బృందాలిచ్చిన నివేదిక ఆధారంగా వీటిని బహుళ ప్రయోజనాలు అందించే పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఈ షాపులన్నింటినీ ఒకే డిజైన్, రంగులు ఉండేలా తీర్చిదిద్దనుంది. గ్రామ స్థాయిలో 150 చ.అ., బ్లాక్/ సబ్ డివిజన్ స్థాయిలో 200 చ.అ., జిల్లా స్థాయిలో 2 వేల చ.అ., విస్తీర్ణంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 17న 864 కేంద్రాలను ప్రారంభించగా.. వీటిలో 32 ఏపీలో ఉన్నాయి. వీటిలో గుంటూరులో 3, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండేసి చొప్పున, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, ఏలూరు, కర్నూలు, అనంతపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు.ఇక దేశవ్యాప్తంగా మొదటి దశలో నవంబర్‌లో 37,460 జిల్లా స్థాయి, 2023 జనవరిలో 1,82,126 బ్లాక్ స్థాయి, ఫిబ్రవరిలో 1,16,049 గ్రామ స్థాయి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి కేంద్రాల్లో పీవోఎస్, క్యూఆర్ కోడ్, స్కానింగ్ మిషన్లు, వ్యవసాయ మ్యాగజైన్లు, పంట సాగు ప్రణాళికలు, భూముల సారం– పంటల మ్యాపులు, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన చార్టులు ప్రదర్శిస్తారు. స్మార్ట్ టీవీలు, భూసార, విత్తన, పురుగుల మందుల పరీక్ష కిట్‌లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, డ్రోన్లు అందుబాటులో ఉంచుతారు. ఇక జిల్లా స్థాయి, గ్రామ, బ్లాక్ కేంద్రాల్లో భూసార, విత్తన, పురుగుల మందులు, నీటి పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు.ఏటీఎంలు, సోలార్ ఎనర్జీ ప్యానళ్లు, హెల్ప్ డెస్క్‌లు, కామన్ సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. రైతులకు సంప్రదాయ, జీవ, సేంద్రియ ఎరువులతోపాటు నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, సూక్ష్మపోషకాలు వంటివాటిని రైతులకు సరఫరా చేస్తారు. యంత్ర పరికరాలు, డ్రోన్లు అందుబాటులో ఉంచుతారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. స్మార్ట్ టీవీల ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులు ఆదర్శ రైతుల విజయగాథలు, తాజా సాంకేతికత వివరాలు అందిస్తారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా కొత్త వినూత్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, తదితర వివరాలను పంచుకుంటారు.