YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఖాళీ కుండలు

ఖాళీ కుండలు

వేసవి తాపం ఉమ్మడి జిల్లాలోని జలాశయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు ఒక వైపు, పెరిగిన నీటి అవసరాలు మరోవైపు జలాశయాలను అడుగంటేలా చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాజెక్టుల్లో అవసరాలకు అనుగుణంగా నీటి వినియోగం జరగగా మంచిర్యాల ప్రాంత వరప్రదాయిని ఎల్లంపల్లి జలాశయంలో మాత్రం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగానే నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జలాశయాలు అడుగంటడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ మీద ప్రభావం చూపి నీటి కటకట ఎదురుకానుండగా మరో వైపు మత్స్యకారులు చేపలు పట్టడానికి, ఖరీఫ్‌లో జలాశయాలు నిండకుంటే రైతాంగానికి సాగుకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.

జలాశయాల్లో నీరు అడుగంటడంతో వేసవిలో తాగునీటికి ఇబ్బంది తప్పేలా లేదు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం భావించినా జలాశయాల్లో రోజురోజుకు తగ్గుతున్న నీటి నిల్వల కారణంగా తాగునీరుఅందించడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లాలో మిషన్‌భగీరథ పనులు పూర్తయిన చోట తాగునీరు అందించేందుకు వీలుగా ప్రయోగాత్మక పరిశీలన కూడా నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో గోదావరి నీటి పథకం కింద జిల్లాలోని పలు మండలాలకు ఇప్పటికే నీటి సరఫరా జరుగుతోంది. రోజురోజుకు నీటి నిల్వలు తగ్గడంతో కొత్త పథకాలు పక్కన పెడితే ఇప్పటికే అందిస్తున్న ప్రాంతాలకు కూడా తాగునీరు అందించడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది అధికారుల పరిస్థితి.  జిల్లాలో అతిపెద్ద జలాశయం ఎల్లంపల్లిలో నీటి నిల్వ సామర్యం గతేడాది ఇదే సమయానికి 10.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం కేవలం 2.9  టీఎంసీలకు పడిపోయింది. పరిస్థితిని అంచనా వేయడంలో అధికారుల విఫలం కావడం వల్లే ఇలాంటి దుస్థితి తలెత్తిందని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో జలాశయం ద్వారా కేటాయింపులను కూడా పట్టించుకోకుండా ఇబ్బడిముబ్బడిగా నీటిని వదిలినందునే నీరు పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు ఇప్పుడిప్పుడే పూర్తి కావస్తున్నా ఇప్పటికీ జలాశయాల నుంచి నీటిని వాడాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది అనూహ్యంగా ఎండిపోతుండటంతో భవిష్యత్తులో మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు పూర్థిస్థాయిలో తాగునీరు అందిస్తే జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితి ఎలా ఉండబోతోందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts