విజయవాడ, అక్టోబరు 21,
నిన్నటి వరకూ పార్టీ టికెట్ మాకే అన్న ధీమాతో ఉన్న వైసీపీ మంత్రులూ, ఎమ్మెల్యేలూ ఇప్పుడు ఆ ధీమాను కోల్పోయారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సాధారణంగా ఎన్నికల ముందు అధికార పార్టీ సిట్టింగులు మరో సారి టికెట్ మాదే అన్న ధీమాతో ఉంటారు. అయితే విచిత్రంగా వైసీపీలో మాత్రం సిట్టింగులలో ఆ ధీమా కనపడటంలేదు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం పాలనా వైఫల్యాలతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంది. ప్రభుత్వ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాల్సిన సీఎం జగన్ మాత్రం ప్రభుత్వ గ్రాఫ్ పడిపోవడానికి ఎమ్మెల్యేల పనితీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను క్రమం తప్పకుండా బటన్లు నొక్కుతూ లక్షలకు లక్షల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలోకి బదలీ చేస్తుంటే.. తనపై ఆగ్రహం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఆగ్రహం అంటూ ఏమైనా ఉంటే అది ఎమ్మెల్యేల పని తీరు వల్లేనని ఆయన వర్క్ షాపుల్లోనూ, సమావేశాల్లోనూ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలైనా, మంత్రలైనా ప్రజాక్షేత్రంలో అభిమానాన్ని చూరగొటేనే పార్టీ టికెట్ అని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. అందుకే ఎక్కడా లేని విధంగా అధికారంలో ఉండి కూడా వైసీపీ నాయకులలో ఓటమి భయం కనిపిస్తోంది. జగన్ తీరుతో ఇప్పటికే భవిష్యత్ ఏమిటా అన్న ఆందోళనలో ఉన్న వైసీపీ నేతలకు తాజాగా తెలుగుదేశం, జనసేన పొత్తుపై వస్తున్న వార్తలు మరింత ఆందోళనలోకి నెట్టాయి.తెలుగుదేశం, జనసేన పార్టీలే వేర్వేరుగా పోటీ చేస్తేనే విజయావకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయని సర్వేల నివేదికలు వెల్లడిస్తుంటే.. ఇప్పుడా రెండు పార్టీలూ కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఇక ఆశలు వదిలేసుకోవలసిందే అని పార్టీ శ్రేణులే చెబుతున్న పరిస్థితి. తెలుగుదేశం, జనసేన పొత్తు వార్తల నేపథ్యంలో జగన్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో సరికొత్త ఫార్ములాతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి బరిలోకి దిగితే.. ఒక లెక్క.. వేర్వేరుగా పోటీకి దిగితే మరో లెక్క అని ఆయన చెబుతున్నారని అంటున్నారు. ఆ ఇరు పార్టీలూ కలిసి ముందుకు సాగితే.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో పార్టీ టికెట్లు అత్యధిక శాతం బీసీలకే కేటాయించేందుకు నిర్ణయించుకున్న జగన్ అక్కడ వైసీపీ సిట్టింగులకు ప్రజాబాహుల్యంలో ఆదరణ ఉన్నా కూడా వారిని మార్చి బీసీలనే పోటీకి నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అందుకే ఇప్పటికే తయారైన అభ్యర్థుల జాబితాకు తోడుగా రెండో జాబితా కూడా తయారౌతోందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలోప్రధానంగాకాపు సామాజిక బలమైన నాయకులు ఉన్న స్థానాలలో కూడా అధికారంలో ఉండి కూడా వైసీపీ మంత్రులూ, నాయకులకూ నేల కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి వారిలో ఎక్కడ లేనీ టెన్షన్ కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నిక లొస్తున్నాయంటే విపక్ష నేతలలో టెన్షన్ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం విచిత్రంగా ఆ టెన్షన్ అధికార పార్టీ నాయకులలో కనిపిస్తోంది.పార్టీ టికెట్ వస్తుందా? వచ్చినా గెలుస్తామా? అన్న బెంగా, భయం వారి ప్రతి మాటలోనూ, ప్రతి చేష్టలోనూ కనిపిస్తోంది. ఈ టెన్షన్, ఆ భయం కారణందగానే ఇటీవల వారసుల టికెట్ల విషయమై మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మాకే దిక్కులేదు ఇక వారసుల్ని గెలిపించుకోగలమా అని వ్యాఖ్యానించారు. అసలు ఎమ్మెల్యేలూ, మంత్రులకు ఈ మూడున్నరేళ్లలో నియోజకవర్గ ప్రజలలో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఒక్క పని కూడా చేసిపెట్టలేని ఆశక్తత, ఒక్క పింఛన్, ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేని నిస్సహాయత, కనీసం నియోజకవర్గంలోని రోడ్లకు గుంతలు కూడా పూడ్పించలేకపోయిన అసమర్థత వారిని నియోజవకర్గానికి దూరం చేశాయనే చెప్పాలి. అందుకే ఇప్పుడు గడపగడపకూ అంటు జనం వద్దకు వెళుతుంటే వారు నిర్మొహమాటంగా మొహం మీదనే తలుపులు వేసే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనాగ్రహ సెగలను తట్టుకోలేక గడపగడపకూను మమ అనిపిస్తే సీఎం కన్నెర్ర చేస్తున్నారు. ఈ పరిస్థితిల్లో వైసీపీ నాయకులూ, మంత్రులూ నానా అగచాట్లూ పడుతున్నారు. ఉన్న ఇబ్బందులు చాలవన్నట్లు తాజాగా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు వారి ఇబ్బందులను రెట్టింపు చేశాయి. ప్రజాసమస్యలపై కలిసి పోరాడుతాం అంటూ తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనతో పార్టీ టికెట్ దక్కినా గెలవడం సాధ్యం కాదన్న నిర్వేదం వారిలో కనబడుతోంది. ఆ విషయాన్ని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పటికే ప్రజాగ్రహ జ్వాలలలో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట మసకబారిందన్న అంచనాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేనల కలయిక పార్టీ పరిస్థితిని మరింత దయనీయ స్థితికి చేర్చిందని వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.ఇప్పటి దాకా 175 కి 175 సీట్లు మనకే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు తెలుగుదేవం, జనసేన జుగల్ బందీ వార్తలతో బెంబేలెత్తుతోంది. ఇరు పార్టీలూ పొత్త కుదుర్చుకుని ముందుకు సాగితే.. వైసీపీకి కష్టమే అన్న భావన పరిశీలకులలోనే కాదు.. పార్టీలో కూడా గట్టిగా వ్యక్తమౌతోంది. దీంతో ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకుని పార్టీ టికెట్ల విషయంలో కూడా కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తూ వచ్చిన వైసీపీ అధినేత ఇప్పుడు వ్యూహం మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఆయన ఇప్పుడు బీసీలకు అత్యధిక టికెట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం, జనసేనల కలయిన ద్వారా పార్టీకి జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీలోని కీలక నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు.ఇదే ఇప్పటి వరకూ తమకు డోకా లేదని భావిస్తూ వస్తున్న సిట్టింగ్ లకు గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టికెట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక ముందు మరో లెక్క అని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టిన జగన్ రెండు జాబితాలను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఓ జాబితా, వేర్వేరుగా పోటీలో దిగితే మరో జాబితా అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.