YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీతో పాటు గుజరాత్ ఎన్నికలు..?

ఢిల్లీతో పాటు గుజరాత్ ఎన్నికలు..?

గాంధీనగర్, అక్టోబరు 25, 
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఓ పార్టీ వ్యూహలకు, మరోపార్టీ ప్రతి వ్యూహాలతో చెక్ పెడుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకెళ్తోంది. ఇదే సమయంలో ఆప్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు బీజేపీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది.  గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ గెలుపును అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. దీనిలో భాగంగా ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించారు. అయితే ఢిల్లీలో వాయిదాపడిన మున్సిపల్ ఎన్నికలను గుజరాత్ శాసనసభ ఎన్నికలతో కలిపి నిర్వహించడం ద్వారా గుజరాత్ లో ఆప్ దూకుడును నియంత్రించవచ్చనే ఆలోచనలో కమలం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ కంచు కోటగా ఉన్న గుజరాత్ లో కమలం జెండాను దించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఆమ్ ఆద్మీ ఆశలను వమ్ము చేయడానికి బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటే డిసెంబరు మొదటి వారంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలను చివరి క్షణంలో వాయిదా వేశారు. నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లను మూడింటిని విలీనం చేస్తూ ఈఏడాది మేలో కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి ఓడిపోతుందనే భయంతో ఎన్నికలను వాయిదా వేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తూ.. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేసే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టును కూడా ఆశ్రయించింది. తాజాగా డీలిమిటేషన్ కసరత్తు చేసేందుకు ఏర్పాటైన కమిషన్ ఇప్పటికే తన నివేదికను ఇవ్వగా, దానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. నివేదిక ఆధారంగా మొత్తం 272 సీట్లను 250కి కుదించగా.. 250 డివిజన్లలో ఒక్కో డివిజన్ కు సరిహద్దులు నిర్ణయించడానికి ప్రారంభమైన కసరత్తు త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లోనూ విజయం కోసం తన ప్రయత్నాలు చేస్తోంది. అయితే పంజాబ్ విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలను వీలైనంత ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ డిసెంబర్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు కార్యచరణ సిద్ధం చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి గల ఉద్దేశాలను చూస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికలు, గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే ఢిల్లీలో పట్టుకోసం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం దేశ రాజధానిలోని మున్సిపల్ కార్పోరేషన్ ను గెల్చుకోవడంపై దృష్టిసారించే అవకాశం ఉంది. అందుకే గుజరాత్ లో ఆమ్ ఆద్మీ దూకుడుకు సాధారణంగా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతం బాగా రావడంతో గుజరాత్ లో ప్రధాన పార్టీగా అవతరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 28 శాతం ఓట్లతో 18 నుంచి 24 సీట్లు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఫలితాలే వస్తాయని కచ్చితంగా చెప్పలేం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఏడవసారి విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ శాసనసభ ఎన్నికలను కమలం పార్టీ ఈజీగా తీసుకోదల్చుకోలేదు. గుజరాత్ ఫలితం దేశం మొత్తం వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూసే అవకాశం ఉన్నందున బీజేపీ ఎలాగైనా గుజరాత్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది.మరోవైపు గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఆప్ కు చెందిన కొందరు సీనియర్ నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌ లో ఎక్కువుగా పర్యటిస్తూ.. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గుజరాత్ శాసనసభ ఎన్నికలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బతగులుతుందనే చెప్పుకోవాలి. మరోవైపు ఢిల్లీ ప్రజలు గత కొన్నేళ్లుగా మిశ్రమ తీర్పును ఇస్తున్నారు. ఢిల్లీ ఓటర్లు లోక్‌సభ, మునిసిపల్ ఎన్నికలలో బిజెపికి ప్రాధాన్యత ఇస్తుండగా, అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే, వారు రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని అందించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గుజరాత్- ఢిల్లీలో ఎన్నికలు ఒకేసారి జరిగితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు చోట్ల సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. తద్వారా తమకు లబ్ధి చేకూరవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు అర్థమవుతోంది.

Related Posts