కడప, అక్టోబరు 26,
2019 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు మీద వుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఫ్యాన్ గాలి హవా కొనసాగుతూనే వుంది. తాజాగా సీఎం స్వంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్‌లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు పోటీలో లేవు. కానీ, బీజేపీ, ఇండిపెండెంట్లు, మరో పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్ధుల్ని బరిలో నిలిపింది. ఎలాగైనా తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్‌లు ముందుకెళుతున్నాయి. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఆయా పార్టీల ప్రభావం అంతగా ఉండదని తేలిపోయింది.గెలుపు పక్కా అని తెలిసినా.. మెజారిటీ గురించే వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. సీఎం స్వంత జిల్లా కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పక్కనే వున్న చిత్తూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరుండి మరీ ప్రచారంలో దూసుకుపోతున్నారు.బీజేపీ, కాంగ్రెస్‌లను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. అక్కడ మాత్రం హడావిడి కొనసాగుతోంది. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి.. మూడు పార్టీల నేతలు అక్కడే మకాం వేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రచారంపై క్లారిటీ వచ్చింది. బద్వేల్ రాలేకపోతున్నానని.. వైసీపీ అభ్యర్థి సుధకు ఓటు వేయాలని ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ లేఖ పంపారు.కరోనా పరిస్థితులు, ఎన్నికల సంఘం నిబంధనలతో తాను బద్వేల్ రాలేకపోతున్నానని భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని కోరారు. బద్వేల్ నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలకు, అన్మదమ్ములకు ఆత్మీయ లేఖ రాశారు. ఉప ఎన్నిక సందర్భంగా తన కుటుంబ సభ్యులైన ఓటర్లతో బద్వేల్ వచ్చి గడపాలని.. ప్రత్యక్షంగా బహిరంగ సభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను అన్నారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాలేకపోతున్నానని.. అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నానని లేఖలో ప్రస్తావించారు. తాను అక్కడికి వస్తే.. భారీగా జనాలు ఒక్కసారిగా గుమిగూడితే వారిలో ఏ కొందరికైనా కొవిడ్ వచ్చే ప్రమాదం ఉందని జగన్ అన్నారు. అందరి ఆరోగ్యాలను, ప్రాణాలను, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తన పర్యటనను రద్దు చేసుకుంటున్నా అన్నారు జగన్.ఈ పరిస్థితుల్లో తన భావాలను ప్రత్యక్షంగా పంచుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను అన్నారు. లేఖలో నవరత్న పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందో కుటుంబాల వారీగా వివరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలుగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.సీఎం వైఎస్ జగన్ రాసిన ఈ లేఖను ముద్రించి స్థానిక నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు పేరు పేరున స్వయంగా అందిస్తున్నారు. ప్రచార సమయం ముగింపు దశకు చేరుకోనుండడంతో వైసీపీ నేతలు వేగం పెంచారు. గతంలోనూ తిరుపతిలో లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొనలేదు. ఓటర్లకు లేఖలు రాశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ భారీ మెజారిటీ వైసీపీ స్వంత మయింది.తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి భారీ విజయాన్ని నమోదు చేశారు. 2లక్షల 70వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2019లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించిన 2లక్షల 28 వేల ఓట్ల మెజార్టీని అధిగమించి గురుమూర్తి ఘన విజయం సాధించారు. బద్వేల్‌లోనూ భారీ మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది. జగన్ రాకపోయినా భారీ మెజారిటీ సాధిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద బద్వేల్ దంగల్‌లో విపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.