విజయవాడ, అక్టోబరు 26,
ఇళ్ల స్థలాల కోసం ఆవ భూముల్ని కేటాయించడాన్ని సవాల్ చేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. పేద ప్రజలకు ఇళ్ల వసతి కల్పనకు ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, రాజానగరం మండలాల్లోని ఆవ భూములను సేకరించింది. భూముల కొనుగోళ్ల పేరుతో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లను చీఫ్ జస్టిస్ పికె మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టేస్తూ.. మంగళవారం తీర్పు వెలువరించింది. హైకోర్టు స్టే వల్ల 40 వేలమంది పేదలకు ఇళ్ల పట్టాల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని, స్టే ఎత్తేయడమే కాకుండా రిట్లను డిస్మిస్ చేయాలని ప్రభుత్వం తరపున అదనపు ఎజి పి సుధాకర్‌రెడ్డి చేసిన వినతిని బెంచ్ ఆమోదించింది. ఆవ భూముల కొనుగోళ్లపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆ జిల్లాకు చెందిన ఎ శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం పిల్ దాఖలు చేశారు. తర్వాత పలు రిట్లు దాఖలయ్యాయి. ఇళ్ల పట్టాలు కేటాయింపు చేయవద్దని గతంలోని మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి చేశారన్న అభియోగాలతో విశాఖ విమానాశ్రయ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని జనసేన దాఖలు చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. కేసులోని నిందితులు కాకుండా ఇతరులు రిట్ దాఖలు చేస్తే ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేయగలమని జనసేనను ప్రశ్నించింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్‌రారు నోటీసులు జారీ చేశారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. మరో కేసులో భాగంగా విశాఖలో జనవాణి పేరిట సభ నిర్వహించేందుకు పోలీసులకు దరఖాస్తు చేసుకోవచ్చునని, పోలీసులు అనుమతివ్వకపోతే హైకోర్టుకు రావచ్చునని అన్నారు.మహిళా, శిశు సంక్షేమశాఖలో అంగన్వాడీ వర్కర్లకు ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇవ్వరాదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో అక్కడే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ ప్రకటించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ పికె మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. అయితే, విశాఖ జోన్‌లో ఎక్స్‌టెన్షన్ అధికారుల నియామక ప్రక్రియను నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్ల వ్యవహారంపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను రద్దు చేయలేమని, దీనిని సింగిల్ జడ్జి వద్దనే పరిష్కరించుకోవాలని చెప్పింది. రాత పరీక్ష నిర్వహించి ఇంగ్లీషులో ప్రావీణ్య పరీక్ష పెట్టకపోవడాన్ని తప్పుపడుతూ దాఖలైన కేసుల్లో అభ్యర్థులకు అనుకూలంగా గతంలో స్టే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫైనల్ మెరిట్ రిస్టును ఆఫీసర్లు ప్రకటించే అవకాశం ఉందన్న అభ్యర్థుల వినతి మేరకు వెలువడిన స్టే ఉత్తర్వులను సవాల్ చేసిన అప్పీల్ పిటిషన్ తిరిగి ఆయన దగ్గరకే చేరనుంది.