హైదరాబాద్, అక్టోబరు 29,
తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ కలిశాయా.. కలిసి పని చేయాలన్న నిర్ణయానికి వచ్చేశాయా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడానికి బీజేపీతో అవగాహనే కారణమని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవైనా.. ఆ పార్టీ క్యాడర్ మాత్రం ఈ ఎనిమిదేళ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది.ఇప్పుడు ఈ క్యాడర్ అంతా బీజేపీతో కలిసి పని చేయనుందని పరిశీలకులు అంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్యా మైత్రికి ఇరు పార్టీల అధిష్ఠానాలూ పచ్చ జెండా ఊపేశాయని కూడా చెబుతున్నారు. ఈ మైత్రి ముందు ముందు ఏపీలో కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. ముందుగా మునుగోడు ఉప ఎన్నికలో నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ అంతా బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో మునుగోడులో తెరాస, కాంగ్రెస్ ల పరాజయమే లక్ష్యంగా తెలుగుదేశం, బీజేపీలు కలిసి నడుస్తున్నాయని చెబుతున్నారు.ఏపీలో కూడా ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలలో మిత్రులుగానే పని చేస్తాయన్న సంకేతాలు ఇప్పటికే అటు బీజేపీ అగ్రనాయకత్వం నుంచీ, తెలుగుదేశం వైపు నుంచీ కూడా వస్తున్నాయనీ, ఇందుకు ఏపీలో బీజేపీతో పొత్త తమకు లబ్ధి చేకూరుస్తుందని తెలుగుదేశం భావిస్తుండటం.. తెలంగాణలో తెలుగుదేశంతో మైత్రి తమకు మేలు చేస్తుందని బీజేపీ భావించడం కారణమంటున్నారు. అయినా రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి.. అందుకే నాలుగేళ్ల కిందట తెగిన మైత్రి బంధం మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మళ్లీ ముడిపడుతోందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందనీ పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలన్న తమ ఆకాంక్ష నెరవేరేందుకు అనివార్యమన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కూడా ఉందని అంటున్నారు.అందుకే ఏపీలో తెలుగుదేశంకు దగ్గరయ్యేందుకు వేస్తున్న అడుగులలో భాగంగానే వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో వైసీపీని విస్పష్టంగా వ్యతిరేకిస్తూ అమరావతే ఏకైక రాజధాని అన్నదే తమ విధానమని బీజేపీ ప్రకటించడాన్ని ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.