విశాఖపట్టణం, నవంబర్ 1,
రానున్న ఎన్నికల్లో వైసీపీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాష్ట్ర రాజకీయాలను చూస్తే స్పష్టమవుతోంది. ఇటువంటి తరుణంలో ప్రతి ఓటూ కీలకంగా మారుతున్నది. ఈ రెండు పార్టీల అధికారానికి వారధిగా జనసేన నిలబడింది. జనసేన ఎవరివైపు మొగ్గుచూపితే వారికి అధికారం ఖాయమనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఏ ఓటు అయినా జనసేన మీదగానే టీడీపీకికానీ, వైసీపీకికానీ వెళ్లాల్సి ఉంటుంది అనేది సుస్పష్టం.గతంలోలా రాజకీయంగా తప్పులు చేయకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూడాలనే యోచనలో ఉన్నారు. సినిమాల ద్వారా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానుల ఓట్లను కూడా జనసేనవైపు మళ్లించేలా పవన్ వ్యూహరచన చేస్తున్నారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేసి ఉత్తరాంధ్రలోనే పట్టు నిరూపించుకోవాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు తనకు ఎక్కువ అభిమానులు, పార్టీ శ్రేణులు ఉన్న ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో తన బలాన్ని చూపించాలని పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక టీడీపీకి మొదటి నుండి ఇక్కడ కంచుకోటలాగా నిలబడే పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఆ బలాన్ని మరింత పటిష్ఠం చెయ్యడానికి చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారు. ఇలా అందరికి కావాల్సింది ప్రస్తుతం ఉత్తరాంధ్రనే కావడం ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్‌గా మారింది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో జనసేన చీల్చిన ఓట్లవల్లే నెగ్గి ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులుగా అధికారం చెలాయిస్తున్నవారున్నారు. ఈ రెండు కలిసినా ఎక్కువ మెజారిటీ సాధించినవారు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? టీడీపీకి ఎన్ని వచ్చాయి? జనసేనకు ఎన్ని వచ్చాయి? అనేది విశ్లేషిస్తే ఓట్ల చీలిక లో జనసేన ఎంతటి కీలక పాత్ర పోషించిందో అర్థం అవుతుంది. ఉత్తరాంధ్ర నుండి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మాన ప్రసాదరావుకు 84,084 ఓట్లు పోలవగా తెలుగుదేశం పార్టీకి 78,307, జనసేనకు 7557 ఓట్లు వచ్చాయి. 5,777 మెజారిటీతో గెలుపొందిన ధర్మాన మెజారిటీ జనసేనకు పోలైన ఓట్లకంటే తక్కువ.అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అమర్ నాథ్ కు 73,207 ఓట్లు రాగా టీడీపీకి 65,038 ఓట్లు, జనసేనకు 12,988 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే అమర్నాథ్ కన్నా ఎక్కువ మెజారిటీ వస్తున్నది. భీమిలి నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు 100629 ఓట్లు రాగా, టీడీపీకి 91,917, జనసేనకు 24,248 ఓట్లు వచ్చాయి. అవంతి ఆధిక్యం 9,917గా ఉంది. బుడి ముత్యాలనాయుడికి మాత్రం ఈ రెండుపార్టీలకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. 78,830, 62,438, 3745 వచ్చాయి. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు 89,262 ఓట్లు రాగా, టీడీపీకి, 62,764, జనసేనకు 3659, కాంగ్రెస్ కు 4562, నోటాకు 3353 ఓట్లు పోలయ్యాయి. ఈ మూడు వర్గాలకు చెందిన ఓట్లు కలిపినా ఎక్కువ మెజారిటీయే బొత్సకు వచ్చింది. పలాసలో సీదిరి అప్పలరాజుకు 76,603, టీడీపీకి 60,356, జనసేనకు 6133 ఓట్లు వచ్చాయి.ఈ మూడేళ్ళ లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.. అందరూ భావిస్తున్నట్టు టీడీపీ-జనసేన సహా ఇతర పార్టీలు కలిసి కట్టుగా ఎన్నికలకు వెళితే..ఈ మొత్తం సమీకరణాలు మారిపోనున్నాయి. దానితో ఉత్తరాంధ్ర లోని అధికార పార్టీకి చెందిన కీలక మంత్రులకు ..నేతలకు ఈ టెన్షన్ ఎక్కువైంది.దీనితో అన్ని రాజకీయ పార్టీల లోనూ 2024 లో ఉత్తరాంధ్ర రిజల్ట్ ఏంటి అనే దాని పైనే దృష్టి కేంద్రీకృతమై ఉంది.