పాట్నా, నవంబర్ 2,
బీహార్ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం కాబోతున్నాయా?. రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి.. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా? నితీష్‌కుమార్ దేశవ్యాప్తంగా విపక్షాలను కూడగట్టి బీజేపీని ఢీకొట్టబోతున్నారా?.. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. తాజాగా నితీష్‌కుమార్ వ్యాఖ్యలు.. నితీష్ త్వరలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ.. తేజస్వియాదవ్‌ను ముందుకు నడిపించే సమయం వచ్చిందని చెప్పారు. ఆర్జేడీ, జేడీయూ విలీనం కాబోతున్నాయనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో నితీష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు తేజస్విని ముఖ్యమంత్రిని చేసి, తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారనే సంకేతాన్నిస్తున్నాయి.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఖండిస్తున్నప్పటికీ.. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఢీకొట్టగల అతి కొద్దిమంది కాంగ్రెసేతర నాయకుల్లో ఆయన ఒకడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. జేడీయూ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వేసిన పోస్టర్‌లో ఆ పార్టీ నేత లలన్ సింగ్ సామాజిక న్యాయంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని అన్నారు. బీహార్‌లో ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకు కాగా, ఇతర బీసీ సామాజిక వర్గాలన్నీ జేడీయూ ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లలన్ సింగ్ తన పోస్టర్‌లో సామాజిక న్యాయం అనే పదాన్ని వాడటం ఆ రెండు పార్టీలు విలీనం కాబోతున్నాయనడానికి మరో సంకేతంగా నిలుస్తోంది.