విశాఖపట్టణం, నవంబర్ 3,
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 11, 12 తేదీలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మొత్తం ఏడు అభివృద్ది కార్యక్రమాలకు శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బహిరంగసభ కూడా ఉంటుంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఈ నెల 12న ప్రధాని బహిరంగ సభ కోసం ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ను జిల్లా అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. బహిరంగ సభ, ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు పీఎంఓ ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాద్యతలు చేపడుతుందని ఆయన ప్రకటించారు. విశాఖలో ప్రధాని పర్యటన రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కార్యక్రమమని అన్నారు. ప్రధాని 11న విశాఖకు చేరుకుంటారని, 12 వ తేదీ ఉదయం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని అన్నారు. ప్రధాన మంత్రి విశాఖ విచ్చేయుచున్న సందర్బంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఘనంగా స్వాగతం పలుకుతారని అన్నారు. రైల్వేజోన్ పై మీడియా ప్రతినిదులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సూటిగా సమాధానం ఇవ్వలేదు. ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న కార్యక్రమాల్లో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రాయపూర్- విశాఖపట్నం 6లేన్ల రహదారి, న్వెంట్ జంక్షన్- షీలానగర్ పోర్డు రోడ్డు అభివృద్ది, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరుద్దరణ, గెయిల్ కు సంబందించి శ్రీకాకుళం-అంగుళ్ పైప్ లైన్ ఏర్పాటు, నరసన్నపేట- ఇచ్చాపురం రోడ్డు అభివృద్ది, ఓఎన్ జీసీ యూ ఫీల్డ్ డెవలప్ మెంట్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్ షోర్ కార్యక్రమాలు ఉన్నాయిరైల్వేజోన్ పై ఇప్పటికే రైల్వే మంత్రి స్ఫష్టమైన సమాచారం ఇచ్చారని చెప్పారు. శంకుస్థాపన లేదని విజయసాయిరెడ్డి పరోక్షంగా చెప్పినట్లయింది. ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యా పర్యావరణానికి హానికల్గించకుండా చెట్లు నరకకుండా సమీప ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధాని పర్యటనకు సంబందించి పీఎంఓ కార్యాలయం నుంచి మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం వివరాలు త్వరలో అందనున్నాయని అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ తో పాటు యూనివర్సిటీ ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్ల కొరకు మరి కొన్ని క్రీడా స్థలాలు పరిశీలించించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు. రైల్వే జోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని.. ఇప్పటికే ఖరారైన కార్యక్రమాల ద్వారా స్పష్టమయింది. రైల్వే స్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన ఉంది కానీ.. జోన్ ప్రస్తావన లేకపోవడంతో.. ఉత్తరాంధ్ర వాసులకు నిరాశే ఎదురు కానుంది.