విశాఖపట్టణం, నవంబర్ 3,
ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేత కుటుంబం రాజకీయాలకు దూరం అవుతుందా? టీడీపీలో ఉంటే తమ కుటుంబం ఇక ఎదగలేదని భావించి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టదలచుకుందా? అంటే అవుననే అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు అతి తక్కువ మందే ఉంటారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉండగా, నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబు సరే సరి. ఇక మరో దగ్గర బంధువు, బాలయ్య బాబు అల్లుడు శ్రీభరత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకున్నారు. తన తాత వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నారు. కానీ కాలం కలసి రావడం లేదు. బాలయ్య బాబు సిఫార్సుతో గత ఎన్నికల్లో టిక్కెట్ వచ్చినా గెలవలేకపోయారు. ఉత్తరాంధ్రలో ఒకప్పుడు ఎంవీవీఎస్ మూర్తి అంటే టాప్ లీడర్. ఆయన పార్టీకి అన్నీ తానే అయి వెనకుండి నడిపేవారు. ఒకరకంగా ఉత్తరాంధ్ర టీడీపీని మూర్తి శాసించేవారు. ఆయన మరణం తర్వాత మనవడు శ్రీభరత్ రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలనుకున్నారు. ఎటూ బాలకృష్ణ అల్లుడు కావడం కలసి వచ్చింది. లోకేష్ కో బ్రదర్ కావడంతో ఇంకా పట్టు చిక్కుతుందని భావించారు. 2019 ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 4, 400 ఓట్లతోనే ఓడి పోయారు. విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచినా ఆయన మాత్రం గెలవలేకపోయారు. టీడీపీ నేతలు కొందరు తనకు పని చేయలేదని అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు అయినా వారిపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో శ్రీభరత్ అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఆయన గీతం విద్యాసంస్థల పర్యవేక్షణకే పరిమితమయ్యారు. విశాఖ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. అసలు పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. మరొక విషయం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా? అన్నది కూడా సందేహంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగిన అవమానం, పార్టీలో నేతలు తనకు చేసిన అన్యాయాన్ని శ్రీభరత్ మర్చిపోలేకపోతున్నారని చెబుతున్నారట. ఒకవేళ యాక్టివ్ అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న నమ్మకమూ శ్రీభరత్ కు లేదు. ఇందుకు కారణం వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తులతో వెళ్లడానికి సిద్ధమవ్వడమే.