విజయవాడ, నవంబర్ 3,
గుడివాడ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొడాలి నాని కోవర్టులున్నారని నియోజకవర్గ ఇన్ ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. గుడివాడ నియోజకవర్గానికి టీడీపీ తరఫున కొత్త అభ్యర్థి రాబోతున్నారంటూ కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొద్దిరోజుల క్రితం నుంచి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని, ఇటువంటి ప్రచారాలద్వారా తెలుగుదేశంను బలహీనపరచాలనేదే వారి ఉద్దేశమన్నారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి కొంతమంది కొన్ని పేర్లు ప్రస్తావిస్తుండటాన్ని తప్పుబట్టారు. 20 సంవత్సరాలుగా గుడివాడలో ఇదే జరుగుతోందని, ఇన్నాళ్లుగా పార్టీని చెడగొట్టింది చాలని, ఇదే విషయాన్ని అధిష్టానం దగ్గర కూడా చెప్పానన్నారు. పార్టీకి నష్టం చేసేవారెవరినైనా దూరం పెడతామన్నారని చెప్పారు. కొత్తగా ఇన్ ఛార్జి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నమ్మొద్దని వెంకటేశ్వరరావు సూచించారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలంగా ఉందంటే కార్యకర్తలవల్లేనన్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన భరోసాతోనే తాను ముందుకు వెళుతున్నానని, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. 2024లో గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున తానే బరిలోకి దిగబోతున్నానని ప్రకటించారు. అందరి సహకారం, అండతో కచ్చితంగా విజయం సాధిస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్టీలోని కోవర్టులు కొందరు అర్థరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.గుడివాడ నియోజకవర్గానికి మాజీ మంత్రి పేరును పరిశీలిస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలేనని, అటువంటిదేమీ లేదని అధిష్టానం కూడా స్పష్టత ఇచ్చింది. దీనిపై రావి వెంకటేశ్వరరావు చంద్రబాబును కలిశారు. తాజాగా ఈ విషయంపైనే రావి మరోసారి స్పష్టత ఇచ్చారు.