YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆప్.. టార్గెట్ మధ్యప్రదేశ్

ఆప్.. టార్గెట్  మధ్యప్రదేశ్

భోపాల్, నవంబర్ 3, 
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై గురి పెట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ...తరవాతి టార్గెట్‌ను మధ్యప్రదేశ్‌ వైపు మళ్లించనుంది. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. అక్కడ పెద్ద పార్టీలంటే ఈ రెండే. అంటే...మూడో పార్టీకి ఇక్కడ స్పేస్ ఉంది. ఈ స్పేస్‌ను భర్తీ చేసేందుకు ఆప్ గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే భాజపా కంచుకోట అయిన గుజరాత్‌లో ప్రచార జోరుని పెంచిన ఆ పార్టీ..ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ క్యాంప్‌లు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్ర రాజధాని భోపాల్ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలనూ రచించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడి ఓటర్లలో ఆప్‌ బాగా రిజిస్టర్ అయిపోతే...అటు భాజపాకు, ఇటు కాంగ్రెస్‌కు కాస్త ఇబ్బందే. గుజరాత్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆప్‌...ఆపరేషన్ మధ్యప్రదేశ్ మొదలు పెట్టనుంది. ఇక్కడి ఎన్నికల ప్రచార బాధ్యతని  మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పంజాబ్ ఎంపీ సందీప్ పఠక్‌కు అప్పగించాలనుకుంటున్నారు కేజ్రీవాల్. ప్రస్తుతానికి..ఈయనే  గుజరాత్ ఎన్నికల బాధ్యత తీసున్నారు. వచ్చే వారం ఢిల్లీ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ భోపాల్‌కు రానున్నారు. అప్పటి నుంచి ఇక వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ..మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం రూట్‌మ్యాపి సిద్ధం చేస్తారని తెలుస్తోంది. లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆప్‌నకు 17 మంది కౌన్సిలర్లు, ఓ మేయర్ ఉన్నారు. సింగ్రౌలిలో మేయర్ ఎన్నికల కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయటమే కాకుండా ఆ అభ్యర్థికి మద్దతునిచ్చారు. ఫలితంగా..మేయర్ ఎన్నికల్లో ఆప్ తరపున నిలబడిన రాణి అగర్వాల్ విజయం సాధించారు. దాదాపు 9 జిల్లాల్లో ఆప్ ఉనికి ఉంది. ఈ ధైర్యంతోనే...ఆప్ పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. మధ్యప్రదేశ్‌కు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా...పార్టీని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కేజ్రీవాల్. ఇదే జరిగితే...భాజపా, కాంగ్రెస్, ఆప్‌ మధ్య త్రిముఖ పోరు కనిపించటం ఖాయం. ఈ ఏడాది గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇక్కడి ఎన్నికల తేదీలు కూడా ప్రకటించారు. అటు గుజరాత్‌తో పాటు హిమాచల్‌లోనూ భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఆప్. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలంనిరూపించుకుంటామని ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ చాలా సందర్భాల్లో చెప్పారు. అటు భాజపాను టార్గెట్ చేస్తూ విమర్శలూ చేస్తున్నారు. అంతే కాదు. హిమాచల్‌ ప్రదేశ్‌లో తమకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా జోస్యం చెబుతున్నారు కొందరు ఆప్‌ నేతలు. హిమాచల్ ఆప్‌ అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ ఠాకూర్ ఇటీవలే ఈ లెక్కలు వివరించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌నకు 60కిపైగా సీట్లు వస్తాయని చాలా ధీమాగా చెబుతున్నారు. మొత్తం 68 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్న సుర్జీత్ సింగ్...60కిపైగా సీట్లు వస్తాయని చెప్పటమే చర్చనీయాంశమైంది. అయితే..కేజ్రీవాల్ మాత్రం హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల కన్నా గుజరాత్ ఎలక్షన్లనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భాజపాకు గట్టి పోటీ ఇస్తే...అది జాతీయ అంశమూ అవుతుందని భావిస్తున్నారు.

Related Posts