YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గులాబీ స్టింగ్ ఆపరేషన్ కు స్పందన కరువు

గులాబీ స్టింగ్ ఆపరేషన్ కు స్పందన కరువు

న్యూఢిల్లీ, నవంబర్ 3, 
కేసీఆర్ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని ఏ ముహూర్తాన ప్రకటించారో.. ఆ క్షణం నుంచీ జాతీయ పార్టీల నాయకులు ఆయనను కలుసుకోవడానికే ఇష్ట పడటం లేదు. కేంద్రంలోని మోడీ సర్కార్ పై నిత్యం విమర్శల వర్షం కురిపించే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆప్, ఎన్సీపీ వంటి పార్టీల నాయకులు కూడా కేసీఆర్ కు దూరం పాటిస్తున్నారు.  బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు సాగించిందంటూ.. టీఆర్ఎస్ అందుకు సంబంధించి వాయిస్ ఆడియోలను బయటపెట్టినా బీజేపీయేతర పార్టీలు కానీ, ఆ పార్టీల నేతలు కానీ కేసీఆర్ కు మద్దతుగా, సంఘీ భావంగా కనీసం ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేదు.బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చేస్తున్న ప్రయత్నాలను స్టింగ్ ఆపరేషన్లో టీఆర్ఎస్ బయటపెట్టినట్లు చెప్పుకుని విస్తృత ప్రచారం చేసినా జాతీయ స్థాయిలో కేసీఆర్ కు ఇసుమంతైనా మద్దతు లభించలేదు. అదేదో రాజకీయాలకు సబంధం లేని కేసీఆర్ కుటుంబ అంతర్గత వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులూ వ్యవహరించి మౌనం వహించారు. ఇటీవలే బీజేపీ కుట్రలకు కుతంత్రాలకు చీలికలు పేలికలైపోయిన ఉద్ధవ్ థాక్రే శివసేన కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై నోరు మెదపలేదు. టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు మద్దతుగా నిలవలేదు. టీఆర్ఎస్    విడుదల చేసిన ఆడియో టేప్ లలో హస్తినలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కుట్ర జరుగుతోందని ఉన్నా.. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వెనుక సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నట్లుగా సంకేతాలున్నా.. జాతీయ స్థాయిలో పార్టీలేవీ కనీసం స్పందించలేదు. కేసీఆర్ కు మద్దతుగా నిలవలేదు. కేసీఆర్ కు మద్దతు పలుకుతూ పలువురు నేతలు ఫోన్ చేశారని టీఆర్ఎస్ నుంచి ఏవో ఒకటి రెండు ప్రకటనలు వెలువడినా అదంతా ప్రచారంలో భాగమే తప్ప వాస్తవం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటువైపు నుంచీ కనీస మద్దతు కూడా రాకపోవడం వల్లనే ఎమ్మెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారాన్ని టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఒక ప్రధాన అంశంగా తీసుకువెళ్లడంలో విఫలమైందని వారంటున్నారు. బీజేపీనీ, మోడీ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలూ నాయకులూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఇష్యూగా మార్చి బీజేపీని బదనాం చేయాలన్న టీఆర్ఎస్ ప్రయత్నం కనీస మద్దతు కరవై తుస్సు మంది. బీజేపీ తీరును అవకాశం వచ్చినప్పుడల్లా తూర్పారబట్టే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ, కేరళర సీఎం పనరయి విజయ్ కానీ కనీసంగా కూడా స్పందించకపోవడంతో అసలు టీఆర్ఎస్ స్టింగ్ ఆపరేషన్ విశ్వసనీయతపైనే అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఇదంతా చూస్తుంటే జాతీయ పార్టీల దృష్టిలో టీఆర్ఎస్ ఓ అంటరాని పార్టీగా మారిపోయిందా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రంలో మోడీ సర్కార్ ఢీ కొట్టే సత్తా ఉన్న నాయకుడిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఎవరి నుంచీ ఆశించిన మద్దతు లభించక ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయారని పరిశీలకులు అంటున్నారు.

Related Posts